జేడీ(యూ)అధికార ప్రతినిధి అజయ్‌ అలోక్‌

14 Jun, 2019 16:35 IST|Sakshi

పట్నా :  జేడీ(యూ) అధినేత నితీష్‌కుమార్‌ను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకే తాను పార్టీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ నేత అజయ్‌ అలోక్‌ తెలిపారు. రాష్ట్ర జేడీ(యూ) చీఫ్‌ వశిష్ట నారాయణ సింగ్‌కు సమర్పించిన తన రాజీనామా పత్రాన్ని ఆయన గురువారం రాత్రి తన ట్వీట్టర్‌లో ఉంచారు. ‘నేను పార్టీకి అనుకూలంగా పనిచేయలేకపోవడంతో నా పదవికి రాజీనామా చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీకి, మీకు నా ధన్యవాదాలు. దయచేసి నా రాజీనామాను ఆమోదించండి’ అని పేర్కొన్నారు. 

అయతే ఏ విషయంలో నితీశ్‌ను తాను ఇబ్బంది పెడుతున్నారో అలోక్‌ లేఖలో తెలియజేయలేదు. బెంగాల్‌లోని మమత బెనర్జీ ప్రభుత్వాన్ని ఎక్కువగా విమర్శస్తుండటం, అక్రమ వలసలపై అధికంగా మాట్లాడే విషయంలో పార్టీ అధినేతతో అలోక్‌కి విభేదాలు తలెత్తినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.  బీజేపీతో కలవకుండా బీహార్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ‍ ప్రకటించిన నితీశ్‌ నిర్ణయాన్ని మమత మెచ్చు​కున్నారు. అయితే దీదీ ప్రశంసను అలోక్‌ తోసిబుచ్చారు. తృణమూల్‌ అధినేత్రి మమత బెనర్జీ బెంగాల్‌ రాష్ట్రాన్ని మిని పాకిస్తాన్‌గా మార్చారని అలోక్‌ ఆరోపించారు.

బెంగాల్‌ నుంచి బీహారీలు బయటకు వెళ్లేలా చేస్తున్నారని కానీ ఇలా చేస్తోంది బెంగాలీలు కాదు రోహింగ్యాలు అని అలోక్‌ ఆరోపించారు. అలోక్‌ వ్యాఖ్యలపై ప్రతి పక్షాలు తీవ్రంగా మండి పడ్డాయి. అలోక్‌ సంఘ్‌పరివార్‌ భావజాలంతో మాట్లాడుతున్నారని, నితీశ్‌ కుమార్‌ సామాజిక న్యాయం, మత సమరస్య భావాలకు అలోక్‌ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

రాజీనామా చేసి 24 గంటలు కాకముందే అక్రమ వలసల విషయంలో చర్యలు తీసుకోవాలని నరేం‍ద్ర మోదీని అలోక్‌ ట్వీటర్‌ ద్వారా కోరారు. ‘మీరు అవినీతిని అంతమొందిస్తానని అన్నారు. కానీ బంగ్లాదేశ్‌, బర్మా సరిహద్దుల్లో ఉన్న బీఎస్‌ఎఫ్‌ అధికారుల ఆస్తులు అమాంతం పెరిగాయి. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అంత తేలికగా దేశంలోకి రాలేరు కదా? ఈ విషయాన్ని లోతుగా పరిశీలించండి’ అని అలోక్‌ ట్వీట్‌ చేశారు.

మరోక ట్వీట్‌లో ‘మమతకి వ్యతిరేకంగా పోరాడితే ఏం ప్రయోజనం ఉండదు. మన వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. ప్రత్యేకంగా అమిత్‌షా హోం మంత్రిగా ఉన్నప్పుడు అక్రమ వలసలను అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకోని వాటిని పూర్తిగా నియంత్రించాలి’ అని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు