రాజ్యసభకు కేకే, సురేశ్‌రెడ్డి ఏకగ్రీవం

19 Mar, 2020 02:05 IST|Sakshi
రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి నరసింహాచార్యులు నుంచి ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న సురేశ్‌రెడ్డి, కె.కేశవరావు. చిత్రంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, హరీశ్‌రావు తదితరులు

పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తామని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కోటాలో రాజ్యసభ సభ్యులుగా టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్‌ కె.కేశవరావు, అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. రాష్ట్ర కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్‌ పక్షాన కేకే, సురేశ్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. శ్రమజీవి పార్టీ తరఫున నామి నేషన్లు వేసిన జాజుల భాస్కర్, భోజరాజ్‌ కోయల్కర్‌ నామినేషన్లను ఈ నెల 16న జరిగిన పరిశీలనలో ఎన్నికల అధికారి తిరస్కరించారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో టీఆర్‌ఎస్‌ తరఫున నామినేషన్లు వేసిన కేకే, సురేశ్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. రాజ్యసభలో రాష్ట్ర కోటా నుంచి ఏడుగురు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ప్రస్తుత ఎన్నికతో అన్ని స్థానాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో చేరాయి. అయితే టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు ఎన్నికైన డి.శ్రీనివాస్‌ ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. 

కేసీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం... 
తనను వరుసగా రెండోసారి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసిన పార్టీ అధినేత కేసీఆర్‌కు కేకే కృతజ్ఞతలు తెలిపారు. సురేశ్‌రెడ్డితో కలసి బుధవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని, వివిధ అంశాలకు సంబంధించి కేసీఆర్‌ సూచనలకు అనుగుణంగా నడుచుకుంటామని కేశవరావు ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు, పార్టీ కార్యకర్తలు గర్వపడేలా తన పనితీరు ఉంటుందని కేఆర్‌ సురేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, రాజ్యసభ సభ్యు డిగా పనిచేయడం తనకు అత్యంత సవాల్‌గా భావిస్తున్నట్లు సురేశ్‌రెడ్డి ప్రకటించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా