బాబు పాలనలో అక్రమాలను సమీక్షించాలి : కాకాణి

3 May, 2019 02:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై సమీక్షలు జరగాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్‌ ముగిసి ఫలితాలు వెలువడే సమయంలో తుపాను సమీక్షలంటూ చంద్రబాబు సహా రాష్ట్ర మంత్రులంతా నానా యాగీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. నిజంగా వారి పాలన గురించి తెలుసుకోవాలంటే.. నాటి హుద్‌çహుద్‌ (2014), ఇప్పటి ఫొని తుపాన్ల మధ్య జరిగిన ఘోరాలను ముందుగా పరిశీలించాలన్నారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అందుకు ఆయన మంత్రులు వంత పాడుతున్నారని గోవర్ధన్‌రెడ్డి అన్నారు.

వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వ్యవసాయంపై బొత్తిగా పరిజ్ఞానంలేదన్నారు. గత ఏడాదిగాని, అంతకుముందుగాని మేలో ఖరీఫ్‌ గురించి సమీక్షలేమైనా చేశారా? అని ప్రశ్నించారు. సమీక్షల పేరుతో నిధులను కాజే యడానికి చివరి ప్రయత్నమే ఈ తంతు అని, అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని రైతులు తుపానుకు ముందు మాత్రమే గుర్తుకు వస్తున్నారని సోమిరెడ్డిని ఎద్దేవా చేశారు. ఆయన వ్యవసాయం గురించి అసలు పట్టించుకోవడంలేదని.. గత ఏడాది పది శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదన్నారు. 

>
మరిన్ని వార్తలు