మహాకూటమి ఓ దుష్ట చతుష్టయం

20 Sep, 2018 01:25 IST|Sakshi
నిజామాబాద్‌లో ఎంపీ కవితకు తలపాగాతో సత్కరించిన దృశ్యం

ప్రజలు తిప్పికొట్టడం ఖాయం: కవిత

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: మహా కూటమి ఒక దుష్ట చతుష్టయమని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని పాత్రలు కూటమిలో ఎవరెవరో అనేది వారే తేల్చుకోవాలని ఎద్దేవా చేశారు. బుధవారం నిజామాబాద్‌లో వినాయక విగ్రహానికి పూజ నిర్వహించిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు అనైతికమన్నారు. ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను పట్టి పీడించాయని మండిపడ్డారు. ఇలాంటి పార్టీలతో తెలంగాణ జన సమితి జట్టు కట్టడం హాస్యాస్పదమని చెప్పారు.

తెలంగాణ మీద ప్రేమ లేని పార్టీలు కూటమిగా ఏర్పడుతున్నాయని, ఈ కూటమిని ప్రజలు తిప్పి కొడతారన్నారు. రాష్ట్రంలో ఓట్ల గల్లంతు విషయంలో కాంగ్రెస్‌ నేతలు పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని, అభిషేక్‌ సింఘ్వీ 70 లక్షల ఓట్లు గల్లంతయ్యాయంటే, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని పేర్కొనడం పట్ల వారికే స్పష్టత లేదని విమర్శించారు. ఓటర్ల గల్లంతు అంశం ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వస్తుందని, ఇందులో కూడా కేసీఆర్‌ ఏమో చేశారనడంలో అర్థం ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలకు కోర్టులకు వెళ్లడం, కోర్టుల నుంచి చీవాట్లు పడటం అలవాటేనని అన్నారు. 

మరిన్ని వార్తలు