అన్నీ కలిసొస్తే ఆయనే కేంద్రమంత్రి

25 Mar, 2019 20:56 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(పాత చిత్రం)

రాజన్న సిరిసిల్ల జిల్లా: అన్నీ కలిసి వస్తే కరీంనగర్‌  టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ కేంద్ర మంత్రి అయ్యే అవకాశముందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల వచ్చిన కేటీఆర్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలిస్తే తెలంగాణాకు లాభమని.. కాంగ్రెస్‌ బీజేపీలు గెలిస్తే రాహుల్‌ గాంధీ, నరేంద్ర మోదీలకు లాభమని వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎంపీలతోనే మనం తెలంగాణా తెచ్చుకున్నామని, 16 మంది ఎంపీలు ఉంటే ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలని కోరారు. ఇప్పుడు మోదీకి వేడి లేదు.. కాంగ్రెస్‌కు గాడి లేదు.. రానున్నది సంకీర్ణ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు.

మన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు.. తెలంగాణాకు కేంద్ర మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదని గుర్తు చేశారు. అలాంటి మోదీకి మనం ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. మనకు కావాల్సింది చౌకీదార్‌ నాయకుడు కాదని, దిల్దార్‌ నాయకుడు కావాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శమని, మోదీ, చంద్రబాబు నాయుడు రైతుబంధు పథకాలను కాపీ కొట్టారని తీవ్రంగా విమర్శించారు. దేశంలోనే నెంబర్‌ వన్‌ సీఎంగా కేసీఆర్‌ గుర్తింపు పొందారని కొనియాడారు.

మరిన్ని వార్తలు