‘రాజీనామాలపై రేపటిలోగా నిర్ణయం’

16 Jul, 2019 15:56 IST|Sakshi

బెంగళూర్‌ : కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి దారితీసిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ సర్కార్‌కు చెందిన 15 మంది రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహరంపై సర్వోన్నత న్యాయస్ధానంలో మంగళవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్ సుప్రీం కోర్టు  తీర్పును బుధవారానికి రిజర్వ్‌ చేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు న్యాయస్ధానం తీర్పు వెలువరించనుంది. రెబెల్‌ ఎమ్మెల్యేల తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపిస్తూ ఎమ్మెల్యేలు తమకు తాముగా రాజీనామాలు చేసి స్వయంగా స్పీకర్‌ను కలిసి వివరించినా వారి రాజీనామాలను ఆమోదించలేదని, వారిపై అనర్హత వేటు వేసేందుకే స్పీకర్‌ కాలయాపన చేస్తున్నారని అన్నారు. నిబంధనల ప్రకారం నిర్ణయం సత్వరమే తీసుకోవాలని , తమ ఎమ్మెల్యేలను బలవంతంగా అసెంబ్లీకి రావాలని కోరే హక్కు స్పీకర్‌కు లేదని కోర్టుకు నివేదించారు. రాజీనామా చేయడం ఎమ్మెల్యేల ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు.

తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకోకుండా విశ్వాస పరీక్షలో తాము విధిగా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసేలా స్పీకర్‌ వ్యవహరిస్తున్నారని రెబెల్‌ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఇక స్పీకర్‌ తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వి వాదనలు వినిపిస్తూ రెబెల్‌ ఎమ్మెల్యేల అనర్హత, రాజీనామాలపై స్పీకర్‌ బుధవారం నిర్ణయం తీసుకోనున్నందున వీరి రాజీనామాలపై న్యాయస్ధానం గతంలో విధించిన యథాతథ స్ధితిని సమీక్షించాలని కోరారు.

ఇక బల పరీక్షకు సంబంధించిన అసెంబ్లీ ప్రొసీడింగ్స్, చర్చల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోరాదని గురువారం అసెంబ్లీలో దీనిపై పూర్తి స్థాయి చర్చ ఉంటుందని,  ఆయా ఎమ్మెల్యేలు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కర్ణాటక సీఎం కుమారస్వామి తరపున న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కూలదోసి ఉద్దేశంతో రాజీనామాలు చేస్తే వాటిపై కచ్చితంగా స్పీకర్ విచారణ చేసి నిర్ణయం తీసుకుంటారని, ఈ అంశాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే న్యాయపరిధి లేదని వాదించారు. మరోవైపు రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత వేటుపై రేపు ఓ నిర్ణయం తీసుకుంటానని స్పీకర్‌ ఆర్‌ సురేష్‌ కుమార్‌ సుప్రీం కోర్టుకు తెలిపారు.

మరిన్ని వార్తలు