చట్టసభల్లో కోర్టుల జోక్యం సరికాదు

14 Aug, 2018 02:52 IST|Sakshi

వేటి అధికారాలు వాటికే ఉండాలి: సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాస్వామ్యంలో చట్టసభల అధికారం వాటికే ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. అసెంబ్లీ అధికారాలు అసెంబ్లీకే ఉండాలని, ఈ విషయంలో కోర్టుల జోక్యం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్‌.సంపత్‌కుమార్‌ల అసెంబ్లీ బహిష్కరణ అంశంపై కోర్టు తీర్పుల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల వేతన సవరణపై పీఆర్సీ మధ్యంతర నివేదిక ఇంకా రాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ప్రతిపాదించిన జోనల్‌ వ్యవస్థకు త్వరలోనే ఆమోదం వస్తుందని, నాలుగైదు రోజుల్లో నిర్ణయం రావొచ్చని చెప్పారు. దీనికోసమే పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపివేశామన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..

గ్రూపుల వారీగా బీసీ లెక్కలు
గ్రామపంచాయతీ ఎన్నికల వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. బీసీ జనాభాను గ్రూపుల వారీగా చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. మన రాష్ట్రంలో 1.30 లక్షల గ్రామపంచాయతీ వార్డులు ఉన్నాయి. బీసీల్లో ఐదు గ్రూపుల వారీగా వివరాలను సేకరించాలి. కులాల వారీగా లెక్కలు ఉంటేనే ఇది చేయగలం. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఉన్న లెక్కలు ఉన్నా.. కులాల వారీగా ఉంటేనే గ్రూపుల వారీగా కచ్చితంగా ఇవ్వగలం.

నీతి ఆయోగ్‌లో పారదర్శకత లేదు
నీతి ఆయోగ్‌ అంటే ఏదో నీతితో ఉండే పేరు కాదు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా. పేరులో ట్రాన్స్‌ఫార్మింగ్‌ అని ఉంది గానీ అందులో పారదర్శకత లేదు. నీతి ఆయోగ్‌ పేరు కింద ఉండే కొటేషనల్‌లో సమాఖ్య స్ఫూర్తి అని ఉంటుంది. కానీ చేతల్లో ఇది కనిపించడ లేదు. ప్రజాస్వామ్యంలో అధికారాల బదిలీ జరగాలి. కానీ దీనికి విరుద్ధంగా ఇంకా కేంద్రీకృతంగా మారుతోంది. రాష్ట్రాలను మున్సిపాలిటీలుగా మారుస్తున్నారు. నీతి ఆయోగ్‌ గత సమావేశంలో నేను ఇదే విషయాన్ని మొహం మీదే చెప్పా. అందరు సీఎంలు అభినందించారు. రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు, పథకాలు ఉండాలి. ఆరోగ్య సమస్యల విషయంలో తెలంగాణలో ఉండే రోగాలు వేరు, కోస్తా తీరంలో వచ్చే రోగాలు వేరు. కేరళలో వంద శాతం అక్షరాస్యత ఉంది. అయితే వయోజనుల విద్య కోసమని రెండు శాతం నిధులను తీసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర సీఎం చెప్పారు. ఇలా చేయాల్సిన అవసరం ఎందుకు? అలాగే వ్యవసాయ విధానాలు ప్రాంతాలకు అనుగుణంగా ఉండాలి. స్థానిక పరిస్థితులకు తగినట్లుగా విధానాలు ఉండాలి. ఆర్థికవేత్తలుగా చెప్పుకునే కొందరు పంటకు కనీస మద్దతు ధరల విషయం వచ్చేసరికి ద్రవ్యోల్బణం అని, ఇంకోటని చెబుతారు. ఇలాంటి వారు చెప్పేవి వాస్తవాలు కాదు.

ఒకేసారి రుణ మాఫీ సాధ్యం కాదు
ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్‌ వారు ఆపద మొక్కుల తరహాలో హామీలిస్తున్నారు. ఒకేసారి రెండు లక్షల రుణ మాఫీ అని ప్రకటిస్తున్నారు. ఇది సాధ్యం కాదు. పంజాబ్‌లో హామీ ఇచ్చారు. ఇప్పుడు సాధ్యం కాదని చెబుతున్నారు. కర్ణాటకలో సీఎం కుమారస్వామి నన్నే అడిగారు. మన రాష్ట్రంలో చేసిన విధానం చెప్పా. ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,500 కోట్ల ఆదాయం వస్తుంది. రెండు లక్షల రుణ మాఫీ ఒకేసారి చేయాలంటే ఏడాదిపాటు ఎలాంటి ఇతర ఖర్చులు చేయవద్దు. కాంగ్రెస్‌ నేతల హామీలు ఎలా సాధ్యమో ప్రజలకు వివరించాలి. ఆసరా పింఛన్లు, ఉద్యోగుల వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రేషన్‌ బియ్యం ఏది ఆపేస్తారో చెప్పాలి. అయినా రెండు లక్షల రుణ మాఫీ అని రాహుల్‌గాంధీ గత ఎన్నికల్లోనూ ప్రకటించారు. ప్రజలు నమ్మలేదు. నిరుద్యోగభృతి అని చెబుతున్నారు. హామీ ఇవ్వడం కాదు ఎలా అమలు చేస్తామో స్పష్టత ఇవ్వాలి. ఎవరు నిరుద్యోగి అనేది వివరించాలి. ఎక్కడి నుంచి నిధులు తెస్తారో చెప్పాలి. ఏపీలో మహిళా స్వయం సహాయ సంఘాల రుణాలను మాఫీ చేస్తామని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారు. ఇదే హామీ ఇక్కడ చేద్దామని మా పార్టీ నేతలు నాపై ఒత్తిడి తెచ్చారు. సాధ్యం కాదని వద్దని చెప్పా. కాంగ్రెస్‌ అధికారంలోకి రాదు కాబట్టి ఆ పార్టీ నేతలు ఏదైనా చెబుతారు.

మన పథకాలే ఉత్తమం: కాంగ్రెస్‌ కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వీటికి రెండు మూడు నెలల ముందు కొన్ని పథకాలను ప్రారంభించింది. అభయహస్తం, బంగారుతల్లి ఇలాంటివే. ఎప్పుడో 30 ఏళ్ల తర్వాత ప్రయోజనం కలిగే పథకాలివి. వీటిని అమలు చేయలేమని అసెంబ్లీలోనే నేను స్పష్టంగా చెప్పా. పేద కుటుంబాలకు చెందిన ఆడ పిల్లల పెళ్లిళ్లకు తక్షణ అవసరాలు తీరేలా పథకాలు అమలు చేస్తున్నాం. కేంద్రం ప్రకటించిన ఆయుష్మాన్‌భవలో ఎందుకు చేరడంలేదని ప్రధాని అడిగారు. అంతకంటే మంచిగా అమలు చేస్తున్నామని చెప్పాం. మనం అమలు చేస్తున్న పథకం సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకుంటామని కేంద్రం అడిగింది. మన ప్రభుత్వ పేరును చేర్చాలని చెప్పాం. పేరు పెడతారో లేదో చూడాలి. కేంద్రం ప్రకటించిన బీమా పథకం కంటే మనది ఉత్తమమైనది. రాష్ట్రంలోని రైతు బీమా పథక ంలో ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తోంది.

ఏదీ ఒకరోజులో జరగదు
కొందరు ఇదేనా బంగారు తెలంగాణ అని మాట్లాడుతున్నారు. ఏదీ ఒకరోజులో జరగదు. హైదరాబాద్‌ను మహానగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. రూ.50 వేల కోట్లతో ప్రణాళిక రూపొందించాం. మొక్కను పెడితే కొన్ని ఏళ్లకు చెట్టవుతుంది. ఒకేరోజులో పెరిగితే అది చెట్టు కాదు. బ్రహ్మ రాక్షసి అవుతుంది. వాస్తవాలు పట్టించుకోకుండా ఏది పడితే అది మాట్లాడవద్దు. సింగపూర్‌ ఒక్కరోజులో నిర్మాణం కాలేదు.   

>
మరిన్ని వార్తలు