కేసీఆర్‌ ఆత్మగౌరవ నినాదం

2 Sep, 2018 20:11 IST|Sakshi

సాక్షి, కొంగకలాన్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి ఆత్మగౌరవ నినాదం ఎత్తుకున్నారు. ఢిల్లీకి గులాంగిరీ చేయాల్సిన అవసరం లేదన్నారు. కొంగకలాన్‌లో ఆదివారం జరిగిన ప్రగతి నివేదన సభలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో తీసుకునే నిర్ణయాలన్నీ ఇక్కడే జరగాలని ఆకాంక్షించారు.

‘ఢిల్లీకి గులాములుగా ఉందామని కొన్ని పార్టీలు అంటున్నాయి. తెలంగాణ సంబంధించిన నిర్ణయాలు ఇక్కడ జరగాలా? ఢిల్లీలో జరగాలా? ఢిల్లీకి గులాం, చెంచాగిరి చేసుకుందామా? ఆలోచన చెయ్యండి.. తెలంగాణ జాతి ఒక్కటిగా ఉండాలి. ఢిల్లీకి గులాంగిరి వద్ద’ని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఢిల్లీకి గులాంగిరి చేసే పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇలాంటి పార్టీలు ఢిల్లీ గుమ్మం దగ్గర పడిగాపులు కాసి ఎమ్మెల్యే టిక్కెట్లు తెచ్చుకుంటాయని ఎద్దేవా చేశారు. ప్రతీప శక్తులు, ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ఉంటాయని ధ్వజమెత్తారు. మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని, తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. రాజకీయ నిర్ణయాల పట్ల ఆచితూచి స్పందించారు. త్వరలోనే ప్రకటిస్తానని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు.

మరిన్ని వార్తలు