‘బీరం’ గుడ్‌బై!

21 Mar, 2019 11:15 IST|Sakshi
బీరం హర్షవర్ధన్‌రెడ్డి

సాక్షి, మహబూబ్‌నగర్‌: కాంగ్రెస్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న గద్వాల జేజమ్మ కమలం గూటికి చేరిన మరుసటి రోజే కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సైతం హస్తానికి హ్యాండిచ్చారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారాక రామారావు సమక్షంలో బుధవారం హైదరాబాద్‌లో గులాబీ కండువా
కప్పుకున్నారు. ఆ సమయంలో ఆయన వెంట ఎ మ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కూడా ఉన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరే ముందు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకే తాను కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు హర్షవర్ధన్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు.

నియోజకవర్గ పరిధిలో నెలకొ న్న సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే టీఆర్‌ఎస్‌లో చేరినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ఒకరి తర్వాత ఒకరు.. ముఖ్యనేతలంతా పార్టీని వీడడంతో కాంగ్రెస్‌లో కలకలం రేగింది. వీరి తర్వాత ఇంకెవరెవరు కారెక్కుతారో అనే చర్చ ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి టీడీపీలో గుర్తింపు ఉన్న నాయకుడు. 2004లో రాజకీయ అరగేట్రం చేసిన హర్షవర్ధన్‌రెడ్డి టీడీపీలో ఏ పోస్టు లేకున్నా.. నియోజకవర్గ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించారు.

ఇదే క్రమంలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత  వైఎస్సార్‌సీపీలో పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ సమయంలో ఎమ్మెల్యే టికెట్‌ దక్కించుకున్న ఆయన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుపై పోటీ చేసి 10వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. 2018 ఎన్నికల్లో మళ్లీ జూపల్లి కృష్ణారావుపై పోటీచేసి 12వేల పై చిలుకు ఓట్లతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోవడం, రాష్ట్రంలో రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌ మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. దీనికి తోడు నెల రోజుల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు ప్రారంభమై రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. ఇదే క్రమంలో బీరం సైతం తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో చర్చించి టీఆర్‌ఎస్‌లో చేరాలని పక్షం రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నారు. చివరకు బుధవారం గులాబీ కండువా కప్పుకున్నారు. 

టీఆర్‌ఎస్‌  క్లీన్‌స్వీప్‌  
కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ తనకున్న ఏకైక స్థానాన్ని కోల్పోయింది. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. 2018 ఎన్నిక ల్లో టీఆర్‌ఎస్‌ 13 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. కొల్లాపూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి మా జీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై గెలుపొందారు. తాజా గా బీరం సైతం కారెక్కడంతో ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ అన్ని స్థానాల్లో గులాబీ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసినట్లయింది.     

మరిన్ని వార్తలు