దుమారం రేపిన కోమటిరెడ్డి వ్యాఖ్యలు

14 Nov, 2017 20:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధికార పార్టీలోకి రాకుంటే కేసులు పెడతామని, పార్టీ కండువా కప్పుకోవాలంటూ బెదిరిస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. శాసనమండలిలో మంగళవారం ‘పోలీసు వ్యవస్థ ఆధునీకరణ, శాంతి భద్రతల నిర్వహణ’పై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపాయి. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తీరు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ, ప్రతిపక్షాలపై అనవసర కేసులు పెడుతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే చెప్పినట్లే చేయాలని, లేకుంటే తమను బదిలీచేస్తారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఒత్తిడి భరించలేక సెలవు పెట్టి వెళ్తామని అనేకమంది పోలీసులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. పోలీసులను ఇతర పార్టీలపైకి ఉసిగొల్పితే ఊరుకోబోమని హెచ్చరించారు.

దీంతో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జోక్యం చేసుకుంటూ తమ పార్టీకి లక్షలాది మంది సభ్యులున్నారని, ఇతర పార్టీల నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తమ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు.

మరిన్ని వార్తలు