కేసీఆర్‌ను జైలుకు పంపుతాం..

27 Sep, 2018 16:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ టార్గెట్‌ చేస్తున్న కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని కాంగ్రెస్‌ తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ అవినీతిని ప్రశ్నించిన వారిపై పోలీసు కేసులు, ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ‘మొన్న నన్నూ, సంపత్‌ను.. నిన్న జగ్గారెడ్డి, నేడు రేవంత్‌రెడ్డిపై కేసులు పెట్టి వేదిస్తున్నార’ని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో దామోదర రాజనరసింహతో కలిసి గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ నియంతృత్వానికి కాలం చెల్లిందనీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌పై ఉన్న కేసులను తిరగదోడి జైలుకు పంపుతామన్నారు.

ఉద్యోగులకు అండగా ఉంటాం..
ఉద్యోగుల కాంట్రిబ్యూషనరీ పెన్షన్‌ స్కీమ్‌ను రద్దుచేస్తామని పీసీసీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనరసింహ తెలిపారు. ఉద్యోగులకు అనుకూలంగా ఐఆర్‌, పీఆర్సీని అమలు చేస్తామని అన్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతు నష్టపోకుండా 4వేల కోట్లతో కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి కార్పస్‌ ఫండ్‌ ఇవ్వాలనే విజ్ఞప్తులు వచ్చాయనీ, అధికారంలోకి రాగానే అనుకూల నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర విభజనలో ఆంధ్రాకు వెళ్లిన తెలంగాణ ఉద్యోగుల గోడును టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు.

మరిన్ని వార్తలు