దావోస్‌ సదస్సులో పాల్గొన్న కేటీఆర్‌

24 Jan, 2018 01:58 IST|Sakshi

25న పలు చర్చా కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి

సాక్షి, హైదరాబాద్‌: దావోస్‌లో మంగళవారం ప్రారంభమైన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీతోపాటు వివిధ దేశాల అధినేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈవోలు, చైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 26 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో మంత్రి కేటీఆర్‌ పలు సెషన్లలో ప్రసంగించనున్నారు. డిజిటల్‌ పరిజ్ఞానంపై 25న జరిగే చర్చా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడనున్నారు.

‘భారతదేశంలో ఉత్పత్తుల నమూనాల తయారీకి ప్రోత్సాహం’అనే అంశంపై అదే రోజు జరగనున్న రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభుతో కలసి కేటీఆర్‌ పాల్గొననున్నారు. గత మూడున్నరేళ్లుగా రాష్ట్రానికి వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సదస్సు నుంచి ఆహ్వానం వస్తోందని, తొలిసారిగా రాష్ట్రం తరఫున తాను హాజరవుతున్నానని కేటీఆర్‌ తెలిపారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలోని వ్యాపారానుకూల వాతావరణాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. సదస్సులో భాగంగా పలు కంపెనీలతో సమావేశం కానున్నట్లు మంత్రి తెలిపారు.

పలువురితో కేటీఆర్‌ భేటీ
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ప్లీనరీ అనంతరం మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఎంపీ గల్లా జయదేవ్, పారిశ్రామికవేత్త ముకేష్‌ అంబానీతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలను మర్యాదపూర్వకంగా కలిశారు. పలు కంపెనీలతో సమావేశమయ్యారు. ప్రధానంగా ఇండోరమా వెంచర్స్‌ చైర్మన్‌ అలోక్‌ లోహియాతో సమావేశం అయ్యారు.

థాయ్‌లాండ్‌ దేశానికి చెందిన ఈ గ్రూపు రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను పరిశీలించేందుకు అంగీకరించింది. బ్యాంకాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ టైక్స్‌టైల్స్‌ రంగ అనుబంధ ఉత్పత్తులకు ప్రసిద్ధి. వరంగల్‌ మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ దేశంలోనే పెద్దదని, ఫ్యాబ్రిక్‌ టూ ఫైబర్‌ పద్ధతిలో ఈ పార్కు ఉందని మంత్రి వివరించారు. కొరియా కంపెనీలు ఈ పార్కులో పెట్టుబ డులు పెడుతున్నాయని, ఇండోరమా సైతం ముందుకు రావాలని కేటీఆర్‌ కోరారు.

మరిన్ని వార్తలు