కేబినెట్‌లోకి కేటీఆర్‌

8 Sep, 2019 11:47 IST|Sakshi

మరోసారి మంత్రివర్గంలోకి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

ఆశల పల్లకిలో గంగుల కమలాకర్‌

శాసనమండలిలో విప్‌గా భానుప్రసాదరావు నియామకం    

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్ర మంత్రివర్గంలోకి సిరిసిల్ల శాసన సభ్యుడు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు చేరడం దాదాపు ఖాయమైనట్టే. ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే మంత్రివర్గ విస్తరణలో జిల్లా నుంచి కేటీఆర్‌కు బెర్తు ఖాయమని ఇప్పటికే సంకేతాలు అందగా, ఆయనతోపాటు ఇంకెవరికి ఆమాత్య యోగం లభించనుం దనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. టీఆర్‌ఎస్‌ రెండో విడత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తోపాటు ధర్మపురి నుంచి గెలిచిన సీనియర్‌ శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్‌కు అవకాశం ఇచ్చారు. అనూహ్యంగా గత ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన కేటీఆర్‌ను కేబినెట్‌లోకి తీసుకోలేదు. గత కొంతకాలంగా కేటీఆర్‌కు ఈసారి విస్తరణలో అవకాశం లభిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయనకు పదవి తథ్యం అని తెలుస్తోంది. 

ఈటలను కాదంటే గంగులకు!
కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రెవెన్యూ ఉద్యోగ సంఘం నాయకులకు లీక్‌ చేశారని వచ్చిన వార్తల నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్‌ ఒక్కసారిగా పతాక శీర్షికలకు ఎక్కారు. తనపై వచ్చిన వార్తలను ఖండించే క్రమంలో వారం క్రితం హుజూరాబాద్‌లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘మంత్రి పదవి నాకు భిక్ష కాదు’ ‘గులాబీ జెండాకు ఓనర్లం మేము’ వంటి మాటలతో ఉద్యమ నేపథ్యాన్ని తెరపైకి తెచ్చారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో అదేరోజు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా, వేడి తగ్గలేదు. ఈ క్రమంలో గురువారం టీచర్స్‌ డే సందర్భంగా కరీంనగర్‌ కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కొందరు రాజకీయ నాయకుల మెరిట్‌ గురించి కూడా వ్యాఖ్యానాలు చేశారు.

అంబేద్కర్‌ ఆలోచనలు అమలు కావడం లేదని, పాలకులు సరిగా అర్థం చేసుకోలేదని స్ఫురించేలా మాట్లాడారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈటలను తప్పిస్తారనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. మంత్రిగా ఈటలను తప్పిస్తే బీసీ కోటాలో కరీంనగర్‌ సీనియర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ‘మున్నూరు కాపు’ సామాజిక వర్గం నుంచి కేబినెట్‌లో ఎవరూ లేకపోవడం, ఈటల ఎపిసోడ్‌ గంగులకు కలిసి వచ్చే అవకాశాలు. అయితే కేటీఆర్‌ను ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా తీసుకోనున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈటల నుంచి తప్పిస్తే తప్ప గంగులకు అవకాశం రాకపోవచ్చు. అయితే ఈటలను తప్పించడం ద్వారా తెలంగాణ ఉద్యమ నినాదం తెరపైకి వస్తుందని భావిస్తే మాత్రం యధాతథంగా కొనసాగించవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఎమ్మెల్సీలకు అవకాశం లేనట్టే
శాసనమండలిలో ప్రభుత్వ విప్‌గా పెద్దపల్లికి చెందిన టి.భానుప్రసాదరావును నియమించారు. జిల్లా నుంచి ప్రస్తుతం భానుప్రసాద్‌తోపాటు నారదాసు లక్ష్మణ్‌రావు పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా ఉన్నారు. భానుప్రసాద్‌రావుకు విప్‌గా అవకాశం లభించిన నేపథ్యంలో మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీ కోటాలో జిల్లా నుంచి ఎవరినీ తీసుకోరని తెలుస్తోంది. మిగతా ఎమ్మెల్యేలలో కూడా సంజయ్‌ కుమార్‌(జగిత్యాల), సుంక రవిశంకర్‌(చొప్పదండి), కోరుకంటి చందర్‌(రామగుండం) కొత్తగా ఎన్నికైన వారు కాగా, మిగతా వారిలో ఎవరికి అవకాశం వచ్చే దాఖలాలు లేవు.   

మరిన్ని వార్తలు