టీడీపీ అలా చేసుంటే.. బోటు ప్రమాదం జరిగేదా?

10 Oct, 2019 16:35 IST|Sakshi

సాక్షి, కాకినాడ : గోదావరిలో కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంపై టీడీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రంగా ఖండించారు. బోటు ప్రమాదం మానవ తప్పిదం వల్ల జరిగిందని.. అందులో ప్రభుత్వ వైఫల్యం లేదని తెలిపారు. బోటు ప్రమాదంపై టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం కాకినాడలో ఆయన మాట్లాడుతూ.. బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించిందని తెలిపారు. బోటు ప్రమాదం నుంచి పలువురు పర్యాటకులను కాపాడిన కచ్చులూరు గ్రామస్తులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సహకాలు అందజేస్తారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బోటు ప్రమాదాలు జరిగనప్పుడే.. నిబంధనలు కఠినతరం చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేదా అని ప్రశ్నించారు. 

గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతికి కారణమైన చంద్రబాబు కనీసం ఆ కుటుంబాలకు సంతాపం కూడా తెలుపలేదని విమర్శించారు. తొక్కిసలాటకు కారకులైన వారిపైన చర్యలు తీసుకోకుండా.. ఇప్పుడు బోటు ప్రమాదంపై సీఎం వైఎస్‌ జగన్‌ ఏరియల్‌ సర్వే చేయడాన్ని తప్పుబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ఉన్న ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేయకపోతే.. నీటిపై నడిచి వెళ్తారా టీడీపీ నాయకులను ప్రశ్నించారు. 250-300 అడుగుల లోతున ఉన్న బోటును బయటకు తీయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. బోటును తీయగలం అని ఎవరైనా ముందుకు వస్తే.. అందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు