ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌

25 Nov, 2018 12:50 IST|Sakshi

ఒక బీసీని కాబట్టే నాకు అన్యాయం చేశారు

కాంగ్రెస్‌లో బీసీలు కొనసాగాలన్నా.. టికెట్‌ కావాలన్నా డబ్బులు కట్టాలి

కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరబోతున్న క్యామ మల్లేష్‌

సాక్షి, హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన ఆ పార్టీ సీనియర్‌ నేత క్యామ మల్లేష్‌ ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరబోతున్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నంలో జరగనున్న టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో క్యామ మల్లేష్‌  గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇబ్రహీంపట్నం టికెట్‌ ఆశించినప్పటికీ.. మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీకి టికెట్‌ కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన క్యామ మల్లేష్‌ ఏఐసీసీ పెద్దలపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ పెద్దలు టికెట్లు అమ్ముకుంటున్నారని, భక్తచరణ్‌ దాస్‌ కొడుకు టికెట్‌ కోసం తనను మూడు కోట్లు డిమాండ్‌ చేశారని వెల్లడించి ఆయన సంచనలం రేపారు. దీంతో టీపీసీసీ ఆయనను పార్టీ నుంచి సస్సెండ్‌ చేసేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో క్యామ మల్లేష్‌ పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన బలమైన నేతగా పేరొన్న ఆయన.. తాను బీసీని కావడం వల్లే కాంగ్రెస్‌లో అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘కాంగ్రెస్ అధిష్టానం మాటలు వినకుండా నేను రెబెల్‌గా నామినేషన్ వేయడం బాధాకరమే. కానీ రెబల్‌గా పోటీచేసిన మల్‌రెడ్డి సోదరులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పార్టీ కోసం నిజాయితీగా 35 ఏళ్ళుగా సేవలు అందించాను. కేవలం ఒక బీసీని కాబట్టే నన్నూ ఇలా చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలు కొనసాగలన్నా.. టిక్కెట్ కావాలన్నా.. డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇబ్రహీంపట్నం మహాకూటమి అభ్యర్థి రంగారెడ్డికి మల్లరెడ్డి సోదరులే మద్దతు తెలుపడం లేదు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేశాను. రాష్ట్రంలో ఉన్న బీసీ నేతలు, నా కార్యకర్తలు, అనుచరులతో చర్చలు జరిపిన తర్వాతే కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా. కేసీఆర్ సంక్షేమ పథకాలు బాగున్నాయి. ఈ రోజు ఇబ్రహీంపట్నంలో జరిగే టీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతున్నా’  అని ఆయన స్పష్టం చేశారు.

చదవండి: టికెట్‌ ఇచ్చేందుకు రూ. 3 కోట్లు అడిగారు

35 ఏళ్లు పార్టీకి సేవ.. ఇదా బహుమానం?

మరిన్ని వార్తలు