లాలూ ఇచ్చిన షాక్‌ మాములుగా లేదు

4 Dec, 2017 10:40 IST|Sakshi

పట్నా : రాజకీయాల్లోనే పరస్పర విమర్శలు.. శత్రుత్వం ఉంటాయని.. వ్యక్తిగత జీవితాలకు అవి అడ్డురావని మరోసారి రుజువైంది. బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చేసిన పని ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. 

రాజకీయ ప్రత్యర్థిగా భావించే సుశీల్‌ కుమార్‌ మోదీ ఇంట జరిగిన వేడుకకు లాలూ హాజరై ఆశ్చర్యపరిచాడు. మోదీ కుమారుడు ఉత్కర్ష్‌ వివాహం ఆదివారం జరిగింది. విరోధాలను పక్కనపెట్టి లాలూ ఈ కార్యక్రమానికి హాజరుకాగా, సుశీల్‌సహా అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆపై సుశీల్‌ ఆప్యాయ ఆలింగనంతో లాలూని ఆహ్వానించాడు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని కాసేపు ముచ్చటించారు. లాలూ అక్కడి నుంచి వెళ్లేంతవరకు వారిద్దరినే మీడియా హైలెట్‌ చేయటం విశేషం.  కొన్ని రోజుల క్రితం ఈ పెళ్లి వేడుకకు హాజరై రచ్చ చేస్తానని లాలూ కొడుకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఆ మధ్య హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దానిపై తీవ్ర విమర్శలు రావటంతో తన ప్రకటనపై వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించాడు.

ఈ వేడుకకు కేంద్ర మంత్రులు అరున్‌ జైట్లీ, రవి శంకర్‌ ప్రసాద్‌, రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, గిరిరాజ్‌ సింగ్‌, బిహార్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌, గోవా గవర్నర్‌ మృదులా సిన్హా, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌, హర్యానా సీఎం మనోహార్‌ లాల్‌ ఖట్టర్‌, జార్ఖండ్‌ సీఎం రఘబర్‌ దాస్‌లు హాజరయ్యారు. కళ్యాణ వేదిక నుంచి హాజరైన ప్రజలతో వరకట్నం, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రమాణం చేయించారు.  

మరిన్ని వార్తలు