వామపక్షాల ఐక్యతతోనే మతోన్మాద అంతం

4 Oct, 2018 05:29 IST|Sakshi

ఎంసీపీఐ–ఆర్‌ఎంపీఐ సదస్సులో గౌస్‌

సాక్షి, హైదరాబాద్‌: వామపక్షాల ఐక్యతతోనే మతోన్మాదాన్ని అంతం చేయగలమని ఎంసీపీఐ(యు) అఖిలభారత ప్రధాన కార్యదర్శి ఎం.డి.గౌస్‌ అన్నారు. ఎంసీపీఐ–ఆర్‌ఎంపీఐ పార్టీల ఐక్యత సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ‘వర్తమాన రాజకీయాలు– వామపక్షపార్టీల ఐక్యత అవకాశాలు’పై సదస్సు జరిగింది. సదస్సులో ఆర్‌ఎంపీఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మంగత్‌రాం పాస్లా, చైర్మన్‌ గంగాధరన్‌ తదితరులు పాల్గొని మాట్లాడారు. గౌస్‌ మాట్లాడుతూ.. మత స్వేచ్ఛను హరించివేయడం, పౌరహక్కులను అణచివేయడం, ప్రజల ఆహార అలవాట్లు, ఆచార వ్యవహారాలపైనా ఆంక్షలు విధించడం వంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ అప్రజాస్వామిక విధానాలనే ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తోందని ఈ 2 పార్టీలనుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం వామపక్షపార్టీలపై ఉందన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన బహుజన లెఫ్‌ ఫ్రంట్‌(బీఎల్‌ఎఫ్‌) కారుచీకటిలో కాంతిరేఖ వంటిదన్నారు. కాంగ్రెస్, బీజేపీ,టీఆర్‌ఎస్‌లకు ప్రత్యామ్నాయంగా వామపక్షా లు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. సదస్సులో ఎంసీపీఐ–ఆర్‌ఎమ్‌పీఐ ముఖ్యనేతలు కిరణ్‌జిత్, నారాయణన్, మద్దికాయల అశోక్, అనుభవదాస్‌ శాస్త్రి, కాటం నాగభూషణం, వనం సుధాకర్, హర్‌కమల్‌లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు