మా ఎంపీ చేసింది తప్పే కానీ.. వారిపై ఎంక్వైరీ చేయాలి  

24 Sep, 2023 21:03 IST|Sakshi

న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవనంలో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. ఈ వివాదంపై మరో బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే స్పందిస్తూ మా ఎంపీ చేసింది తప్పే కానీ అంతకుముందు డానిష్ అలీ చేసింది కూడా తప్పేనని దానిపై కూడా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

చంద్రయాన్-3 విజయవంతం కావడంపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూరీ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై పరుషమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ మతపరమైన విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారాన్నే రేపాయి. ఇతర పార్టీల ఎంపీల తోపాటు బీజేపీ నాయకులు కూడా రమేష్ బిధూరీ వ్యాఖ్యలను ఖండిస్తుండగా సహచర బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మాత్రం బిధూరీ వ్యాఖ్యలను ఖండిస్తూనే డానిష్ అలీని కూడా విచారించాలని స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. 

ఈ సందర్బంగా నిశికాంత్ దూబే ఏమన్నారంటే.. లోక్‌సభలో రమేష్ బిధూరీ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం ఆమోదించదగినవి కాదని, అదే సమయంలో డానిష్ అలీ ప్రధానిని కులం పేరుతో దూషించారు కాబట్టి రమేష్ ఆ విధంగా స్పందించారని.. డానిష్ అలీ వ్యాఖ్యలపై కూడా విచారణ జరిపించాలని స్పీకర్‌ను కోరారు. లోక్‌సభ నియమావళి ప్రకారం ఒక సభ్యుడు మాట్లాడుతుండగా కూర్చుని ఉన్న మరో సభ్యుడు అదేపనిగా అడ్డుపడడం కూడా నియమావళిని ఉల్లంఘించడమేనన్నారు. 15 ఏళ్లుగా నేను ఎంపీగా ఉన్నాను కానీ ఇలాంటి ఒకరోజును నేను చూస్తానని ఎన్నడూ అనుకోలేదన్నారు.       

నిశికాంత్ దూబే వ్యాఖలపై బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ స్పందిస్తూ.. సభలో నన్ను మొదట మాటాలతో చంపేశారు ఇప్పుడు సభ వెలుపల నన్ను శారీరకంగా చంపాలని చూస్తున్నారన్నారు. ఇక ఈ విషయంపై రమేష్ బిధూరీ స్పందించడానికి నిరాకరించారు.. మొదట డానిష్ ఆలీ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు కాబట్టే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని ఏదేమైనా ఇప్పుడు దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది సభాపతి కాబట్టి దానిపై తాను మాట్లాడదలచుకోలేదని చెప్పి వెళ్లిపోయారు. 

ఇది కూడా చదవండి: మణిపూర్-మయన్మార్ సరిహద్దులో కంచె! 

మరిన్ని వార్తలు