ఓటడిగే నాథుడే కరువాయె..?

6 Apr, 2019 10:30 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: దేశ ప్రధానిని ఎన్నుకునే పార్లమెంట్‌ ఎన్నికల సందడి జిల్లాలో పెద్దగా కన్పించడం లేదు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు మరో తొమ్మిది మంది అభ్యర్థులు మెదక్‌ పార్లమెంట్‌ నుండి పోటీ చేస్తున్నా.. ప్రచారం మాత్రం అంతంత మాత్రంగా సాగుతోంది. పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరుచోట్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉండటంతో ఎక్కడికక్కడ వారే చూసుకుంటారనే ధీమాతో టీఆర్‌ఎస్‌ ఉండగా.. పెద్ద నాయకుల్లో రోజుకొక్కరుగా చేయిజారి పోవడం.. ఉన్న నాయకుల మధ్య సమన్వయ లోపం, జిల్లాతో పెద్దగా పరిచయం లేని అభ్యర్థి మూలంగా కాంగ్రెస్‌ కేవలం పటాన్‌చెరు, సంగారెడ్డి నియోజకవర్గాలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక భారతీయ జనతాపార్టీ అభ్యర్థికి జిల్లాలో పరిచయాలు ఉన్నా.. పార్టీ క్యాడర్‌ తక్కువగా ఉండటంతో ఆయన ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేకపోతున్నారు. 

ముంచుకొస్తున్న పోలింగ్‌ గడువు 
చూస్తుండగానే.. ఎన్నికల పోలింగ్‌ సమ యం దగ్గర పడుతోంది. ఉగాది పండుగ, తెల్లవారితే ఆదివారం.. ఇంకేముంది ఎనిమిదో తారీఖు రానే వస్తుంది. ఈ నెల 11న పోలింగ్‌.. దానికి రెండు రోజుల ముందే ప్రచార పర్వం ముగించాల్సి ఉంటుంది. అయినా అటు అభ్యర్థులు, ఇటు నాయకులు, కార్యకర్తలు ఎవ్వరికి పట్టని ఎన్నికలు అన్నట్లు వ్యవహరిస్తున్నారని పార్టీల అభిమానులు చెబుతున్నారు. ఇప్పటి వరకు గడపగడపకు తిరిగి పార్టీ గుర్తులు, ఈవీఎంల వినియోగంపై అవగాహన కల్పించడంతోపాటు తమకే ఓటు వేయాలని ప్రచారం చేయాల్సి ఉంది. రాష్ట్రంలో అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో సంగతేమోగాని మెదక్‌ పరిధిలో మాత్రం ఉలుకు పలుకు లేకుండా పోయిందని ప్రజలు అంటున్నారు.   

మరిన్ని వార్తలు