జమూయీ.. గెలుపెవరిదోయి? | Sakshi
Sakshi News home page

జమూయీ.. గెలుపెవరిదోయి?

Published Sat, Apr 6 2019 10:29 AM

Jamui Constituency Review on Lok Sabha Election - Sakshi

బిహార్‌లోని జమూయీ లోక్‌సభ స్థానంలో 11 శాతంగా ఉన్న మహా దళితులు, అదే సంఖ్యలో ఉన్న ముస్లిం మైనారిటీలు ఎటు మొగ్గితే విజయం అటువైపే అనేది విశ్లేషకుల అంచనా. అయితే ఈసారి ఈ రెండు సామాజిక వర్గాలనూ ప్రభావితం చేసేందుకు అన్ని పార్టీలూ తీవ్రంగా యత్నిస్తున్నాయి. అందులో భాగంగానే జమూయీ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నరేంద్రమోదీ పర్యటించి, కాంగ్రెస్‌ పార్టీ దళితులకు ఏ మేలూ చేయలేదనీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ని అవమానించిందనీ మాట్లాడారు. ఇది ప్రధానంగా అక్కడ మహా దళితుల ఓట్లను దృష్టిలో పెట్టుకొని ప్రస్తావించినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బీజేపీ కూటమికే అనుకూలం..
ఎన్డీయే పార్టీల పొత్తులో భాగంగా ఈ స్థానం రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ నాయకత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీ ఖాతాలోకి వెళ్లింది. ఈ స్థానం నుంచి పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ని అభ్యర్థిగా ప్రకటించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో చిరాగ్‌ ఆర్జేడీకి చెందిన సుధాన్షు కుమార్‌ భాస్కర్‌ని ఓడించారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీకి చెందిన భూదేవ్‌ చౌధరీని ముఖాముఖి ఢీకొంటున్నారు. ఈ నియోజకవర్గంలో 90 శాతం గ్రామీణ ప్రాంతాల జనాభా ఉండగా, పట్టణ ప్రజలు 10 శాతంగా ఉన్నారు. ఇందులో ఎస్సీలు 17 శాతం, ఎస్టీలు 3 శాతం ఉన్నారు. బిహార్‌లోని ఆర్జేడీ–కాంగ్రెస్‌ మహా కూటమిలో ఆర్‌ఎల్‌ఎస్పీ కూడా భాగస్వామిగా ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థిపై 11 శాతం ఓట్ల ఆధిక్యంతో చిరాగ్‌ పాశ్వాన్‌ విజయం సాధించారు. ఆర్జేడీకి
25.71 శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన జేడీయూ 25.60 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. అయితే ఈసారి ఎన్నికల్లో జేడీయూ ఎల్‌జేపీకి మద్దతివ్వడంతో ఓట్ల శాతం

గణనీయంగా
పెరగవచ్చునని భావిస్తున్నారు. కాంగ్రెస్‌–ఆర్జేడీల మద్దతు ఆర్‌ఎల్‌ఎస్పీకి ఉన్నప్పటికీ, జేడీయూ, ఎల్‌జేపీ, బీజేపీ కూటమికి 30 శాతం ఓట్లు అ«ధికంగా రావొచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ స్థానం నుంచి ఎన్సీపీ బీఎస్పీ అభ్యర్థులను రంగంలోకి దించినప్పటికీ వారి ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చునని భావిస్తున్నారు.

ఆ రెండు వర్గాల మొగ్గును బట్టే ఫలితం
2014 ఎన్నికల్లో ఎల్‌జేపీకి చెందిన చిరాగ్‌ పాశ్వాన్‌ 85 వేల ఓట్ల మెజారిటీతో ఇక్కడి నుంచి గెలుపు కైవసం చేసుకున్నారు. మహా దళిత్‌ జనాభా 11 శాతంపైగా ఉన్న ఏడు జిల్లాల్లో జమూయీ ఒకటి. అదే సంఖ్యలో ఉన్న ముస్లింలు, మహా దళితులు కలిసి ఫలితాలను ఎటువైపైనా మార్చగలిగే స్థితిలో ఉన్నారు. 2008 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం జమూయీ స్థానానికి మూడోసారి ఎన్నికలు జరగనున్నాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థి భూదేవ్‌ చౌధరి, ఆర్జేడీ అభ్యర్థి శ్యాం రజక్‌పై 29,797 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఈసారి భూదేవ్‌ చౌధరి ఆర్‌ఎల్‌ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జమూయీ లోక్‌సభా నియోజకవర్గ పరిధి జామూయీ, ముంగేర్, షేక్‌ పురా మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 14,04,016 కాగా మహిళలు 6,51,501, పురుషులు 7,52,515 మంది ఉన్నారు. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన నావ్డా, గయ, ఔరంగాబాద్‌తో పాటు జమూయీ నియోజకవర్గంలో మొదటి దశలో ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగనున్నాయి. జమూయీ లోక్‌సభ నియోజకవర్గంలో తారాపూర్, షేక్‌పురా, సికింద్రా, జమూయీ, చకాయి, జన్హాతో కలిపి మొత్తం 6 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

2014 ఎన్నికల్లో ఓట్ల శాతం
ఎల్‌జేపీ : 36.8%
ఆర్‌జేడీ : 25.7%
జేడీయూ : 25.6%

Advertisement
Advertisement