మహారాష్ట్రలో రాజకీయ ప్ర​కంపనలు

23 Nov, 2019 13:47 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్ర​కంపనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌తో చేతులు కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో తీవ్ర కలకలం రేగింది. అన్ని రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. అజిత్‌ నిర్ణయంతో తమకు సంబంధం లేదని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ శనివారం మధ్యాహ్నం 12.30 గంటల​కు మీడియా ముఖంగా ప్రకటించారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ రాక్రే తదితర నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అజిత్‌ నిర్ణయంతో ఎవరూ సంతోషంగా లేరని, బీజేపీతో ఎన్సీపీ ఎన్నడూ చేతులు కలపలేదన్నారు. అజిత్‌ స్థానంలో ఈ సాయంత్రం 4 గంటలకు ఎన్సీపీ లెజిస్లేటివ్‌ పార్టీ నాయకుడి ఎన్నిక జరుగుతుందన్నారు.

గోవాకు అజిత్‌ ఎమ్మెల్యేలు
తన వర్గ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అజిత్‌ పవార్‌ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బల పరీక్షకు ఈ నెలాఖరు వరకు గడువు ఉండటంతో తనతో పాటు ఉన్న ఎన్సీపీ ఎమ్మెల్యేలను గోవాకు తరలించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. బీజేపీకి 36 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు శివసేన పార్టీలోనూ చీలిక వచ్చే అవకాశముందని ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు 8 మంది శివసేన శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎన్సీపీలోని ఎమ్మెల్యేలు అందరూ తమకు మద్దతు ఇస్తున్నారని, ఇక శరద్‌ పవార్‌ ఒంటరేనని బీజేపీ వ్యాఖ్యానించింది.

కాంగ్రెస్‌ తప్పు చేసింది: నిరుపమ్‌
అటు కాంగ్రెస్‌ పార్టీలోనూ లుకలుకలు మొదలయ్యాయి. మహారాష్ట్రలో తమ పార్టీ అపఖ్యాతి పాలైందని, శివసేనతో చేతులు కలపడం పెద్ద పొరపాటని కాంగ్రెస్‌ నేత సంజయ్‌ నిరుపమ్‌ అన్నారు. సీడబ్ల్యూసీని రద్దు చేసి రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొత్తగా కమిటీ వేయాలని సోనియా గాంధీకి సూచించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని, బ్యాక్‌డోర్‌ పాలిటిక్స్‌ పనికిరావని హితవు పలికారు. అజిత్‌ పవార్‌ ఒంటరిగా మిగిలిపోతారని కాంగ్రెస్‌ సీనియర్‌ దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

గవర్నర్‌ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు..
మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు జరుగుతుండగా ఏకపక్షంగా బీజేపీని గవర్నర్‌ ఆహ్వానించడాన్ని ఈ పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. మరోవైపు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేరాలని ఎన్సీపీని కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే ఆహ్వానించారు. తమ ప్రభుత్వంలో చేరితే ప్రఫుల్‌ పటేల్‌, సుప్రియా సూలే కేంద్ర మంత్రులు అవుతారని ఆయన జోస్యం చెప్పారు. (చదవండి: అందుకే కలిశాం; ‘మహా’ ట్విస్ట్‌పై వివరణ)

మరిన్ని వార్తలు