మమత రాజీనామా.. తిరస్కరించిన తృణమూల్‌

26 May, 2019 06:33 IST|Sakshi

కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పశ్చిమబెంగాల్‌లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించడంతో ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ఇరుకునపడ్డారు. ఈ నేపథ్యంలో కోల్‌కతాలో శనివారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన మమతా పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అయితే టీఎంసీ మమతా బెనర్జీ రాజీనామాను తిరస్కరించింది. ఈ సమావేశం అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఈవీఎంలను తారుమారు చేసిందనీ, ఈ ఫలితాల వెనుక విదేశీ శక్తుల హస్తముందని ఆరోపించారు.

అందుకే రాజీనామా చేశా..
‘లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పాలనను ఈసీ 5 నెలల పాటు ఆధీనంలోకి తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను సీఎంగా ఎలా ఉండగలను? అందుకే ముఖ్యమంత్రిగా తప్పుకుంటానని చెప్పాను. కానీ పార్టీ నా రాజీనామాను తిరస్కరించింది. ఈ సీఎం కుర్చీ నాకవసరం లేదు. ఆ కుర్చీకే నా అవసరం ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీనీ నెరవేర్చాం. ఇప్పటివరకూ ప్రజల కోసం పనిచేశా. ఇప్పుడు పార్టీని పటిష్టం చేయడంపై కూడా దృష్టి సారిస్తా. లోక్‌సభ సీట్లలో బీజేపీ అభ్యర్థులకు లక్ష మెజారిటీ దాటేలా వాటిని రీప్రోగ్రామింగ్‌ చేశారు. దీనివెనుక విదేశీ శక్తులు కూడా ఉండొచ్చు. బీఎస్‌ఎఫ్‌ బలగాలు ప్రజలపై ఒత్తిడి తెచ్చి బీజేపీకి ఓట్లేసేలా చేశాయి’ అని మమత ఆరోపించారు.

మరిన్ని వార్తలు