మంత్రుల మధ్య ‘అవని’ చిచ్చు

7 Nov, 2018 00:53 IST|Sakshi
ముంగంటివార్‌, మేనకాగాంధీ

మహారాష్ట్ర మంత్రిని సాగనంపాలని మేనకా గాంధీ లేఖ

ఆమెనే వైదొలగాలన్న ముంగంటివార్‌

న్యూఢిల్లీ/ముంబై: మ్యాన్‌ఈటర్‌ పులి అవనిని చంపిన ఉదంతంలో మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్‌ ముంగంటివార్, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మధ్య వివాదం మరింత ముదిరింది. సుధీర్‌ ముంగంతివార్‌ను కేబినెట్‌ నుంచి తొలగించే విషయాన్ని పరిశీలించాలని మేనకా గాంధీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు మంగళవారం లేఖ రాశారు. దీనికి ధీటుగా స్పందించిన ముంగంటివార్‌..పోషకాహార లోపంలో పిల్లలు చనిపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ మేనకా గాంధీనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వన్యప్రాణులను కాపాడాల్సిన అటవీ మంత్రే వాటిని సంహరిస్తూ విధుల నిర్వహణలో విఫలమయ్యారని మేనక ఆరోపించారు.

పులి అవని గురించి రెండు నెలలుగా ఆయనతో మాట్లాడుతున్నానని, దానికి మత్తు సూది ఇచ్చి పట్టుకోవాలని సూచించానని అన్నారు. మంత్రి కొంత ఓపిక, సున్నితత్వం వహిస్తే పులిని ప్రాణాలతోనే పట్టుకునే వాళ్లమని తెలిపారు. మరోవైపు, అవని హత్యతో తనకేం సంబంధం లేకున్నా మేనకా గాంధీ తనని రాజీనామా చేయాలంటున్నారని ముంగంటివార్‌ అన్నారు. ‘నాకు సంబంధంలేని దానికి నేను నైతిక బాధ్యత తీసుకోవాలనుకుంటే ఒక షరతు. పోషకాహారం లోపంతో చిన్నారులు చనిపోతున్న ఉదంతాలకు కేంద్ర మంత్రి రాజీనామా చేసి ఆదర్శంగా నిలవాలి’ అని వ్యాఖ్యానించారు.

చంపడం పరిష్కారం కాదు..
భారత్‌లో వరసగా జరిగిన రెండు పులుల హత్యపై వరల్డ్‌ యానిమల్‌ ప్రొటెక్షన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. వన్య మృగాలతో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించేందుకు వాటిని హతమార్చడం పరిష్కారం కాదని పేర్కొంది. ‘మానవుడు–జంతువుల మధ్య ఘర్షణ తలెత్తిన సందర్భాల్లో మానవీయ, ప్రొఫెషనల్‌ విధానాలు ఆచరించాలి. అన్ని ప్రభుత్వ విభాగాల మధ్య చక్కటి సమన్వయం రాబట్టి, స్థానికంగా నివసించే ప్రజల్లో వన్యప్రాణుల పట్ల సున్నితత్వం పెంచాలి. ఇలాంటి సందర్భాల్లో మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’ అని భారత్‌లో డబ్ల్యూఏపీ డైరెక్టర్‌ గజేందర్‌ కె.శర్మ అన్నారు.

మరిన్ని వార్తలు