అంతా మీ వల్లే.. 

22 Jun, 2019 08:34 IST|Sakshi

సాక్షి, గుంటూరు : ‘అంతా మీ వల్లే.. అధికారంలో ఉండి పదవులు అనుభవించి కార్యకర్తలను విస్మరించారు.. పార్టీ కోసం కష్టపడిన వారిపైనే రౌడీషీట్లు తెరిపించారు.. పార్టీ వాస్తవ పరిస్థితుల గురించి ముఖ్య నేతలకు వివరిస్తుంటే తరువాత చూద్దాంలే అంటూ దాటవేశారు.. ఎమ్మెల్యేలు, మంత్రులు భజన కోటరీలను ఏర్పాటు చేసుకొని కార్యకర్తలను దగ్గరకు రానీయలేదు..’  అందుకే ఘోర ఓటమి ఎదురైంది అంటూ తెలుగు తమ్ముళ్లు నిరసన గళం వినిపించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల చేతిలో ఘోరంగా ఓటమి పాలైన టీడీపీ శ్రేణులు అంతర్మథనంలో పడ్డారు.

గుంటూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం  సమన్వయకర్తల సమావేశం నిర్వహించారు. అయితే ఓటమిగల కారణాలపై నాయకులు పరస్పర దూషణలకు దిగారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు జి.వి. ఆంజనేయులు, ఎమ్మెల్యేలు మద్ధాళి గిరిధర్, అనగాని సత్యప్రసాదు, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్ర, మాకినేని పెదరత్తయ్య, చదలవాడ అరవిందబాబు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలువురు నేతలు మాట్లాడుతూ అధికారంలో పదవులు అనుభవించిన వారు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను విస్మరించారని దుయ్యబట్టారు.

నరసరావుపేటకు చెందిన ద్వితీయశ్రేణి నాయకుడు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిపైనే రౌడీషీట్లు తెరిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో గ్రూపులు కట్టి అభ్యర్థి ఓటమికి కారణం అయ్యారన్నారు. ప్రత్యర్థి పార్టీ కంటే సొంత పార్టీ వాళ్లే ఓడించారన్నారు. టీడీపీ సీనియర్‌ నాయకుడొకరు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలోనే జిల్లా సభ్యత్వాలు కట్టించడంలో ప్రథమస్థానం సాధించామని, ఓట్లు వేయించటంలో మాత్రం విఫలమయ్యామని పేర్కొన్నారు. పదవుల కోసం ఆరాటం తప్పితే కార్యకర్తలను పట్టించుకోలేదన్నారు.

పార్టీలో ద్వీతీయశ్రేణి నాయకలు, కార్యకర్తలు వాస్తవ పరిస్థితుల గురించి ముఖ్య నేతలకు వివరిస్తుంటే ఇప్పుడు కాదు తరువాత చూద్దాంలే అని దాటవేత «ధోరణే కొంప ముంచిందని పలువురు చెప్పారు. ఇతర నాయకులు మాట్లాడుతూ పార్టీ అనుబంధ సంఘాలతోనే ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ఉపాధ్యాయుల సంఘం నాయకుల తీరు కారణంగా ఇతర ఉపాధ్యాయులు పార్టీకి పూర్తిగా దూరం అయ్యారన్నారు. నాయకులు మధ్య సఖ్యత లేకపోవటంతో కార్యకర్తలను పట్టించుకోలేదన్నారు. దీంతో పార్టీకి ఎక్కువ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు భజన కోటరీలను ఏర్పాటు చేసుకొని సామన్య కార్యకర్తలను దగ్గరకు కూడా రానీయలేదన్నారు. నియోజకవర్గాల్లో అధికార పార్టీ సామాజిక వర్గం మినహా ఇతరులను పూర్తిగా విస్మరించారని వెల్లడించారు.

పరస్పర ఆరోపణలతో సమావేశం...
ఈ సమావేశంలో పాల్గొన్న ద్వీతీయ శ్రేణి, మాజీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన పార్టీ అభ్యర్థుల పరస్పర ఆరోపణలతో పూర్తిగా సమావేశం కొనసాగింది. ఆరోపణలు శ్రుతిమించటంతో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కలుగచేసుకొని ఇది సమయం కాదని.. ఇక సమష్టిగా పనిచేద్దామని నాయకులను వారించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేబినేట్‌లో ఆమోదించిన రుణమాఫీని అమలు చేసేందుకు కోర్టులను ఆశ్రయించాలని, జిల్లాలో టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులపై ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నాలు చేయ్యాలని, టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారటాన్ని ఖండిస్తున్నామని తీర్మానాలు చేశారు. కోడెల కుటుంబీకులపై నమోదవుతున్న కేసులను ఖండిస్తూ జిల్లా నాయకులు ఎవరూ మాట్లాడలేదు. సమావేశానికి మాజీ ఎమ్మేల్యే యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మలపాటి శ్రీధర్, ఎమ్మెల్సీ అన్నం సతీష్, నియోజకవర్గ ఇన్‌చార్జులు నసీర్‌ అహ్మద్, గంజి చిరంజీవి తదితరులు హాజరుకాలేదు. 

మరిన్ని వార్తలు