సభలోంచి ఎందుకు పారిపోయావ్‌

1 Nov, 2019 10:36 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జోగు రామన్న

లంబాడీలను ఎస్టీ నుంచి తొలగిస్తామని బీజేపీ నాయకులతో చెప్పించండి

పదవికి రాజీనామా చేస్తా అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం

ఎంపీకి సవాల్‌ విసిరిన ఎమ్మెల్యే రామన్న

ఆదిలాబాద్‌టౌన్‌: ఐటీడీఏ గవర్నింగ్‌ బాడీ సమావేశంలో గిరిజనుల సమస్యలను చర్చించకుండానే మధ్యలో నుంచి ఎందుకు పారిపోయావని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న ఎంపీ సోయం బాపురావును ప్రశ్నించారు. గురువారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ క్యాంప్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎక్కడా అడ్డుపడటం లేదన్నారు. ఆదివాసీలకు ఒక పిలుపునిస్తే కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలే ఉండవన్నావు.. నక్సలైట్, ఉగ్రవాదుల మాట్లాడిన ఆ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరితే సభ మధ్యలో నుంచే పారిపోయావని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎంపీ వ్యాఖ్యలపై లీగల్‌ ఒపీనియన్‌ తీసుకొని చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తమకు చెప్పినట్లు వివరించారు.

బీజేపీ నాయకులైన కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ను పిలిచి ఆదిలాబాద్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేసి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తామని చెప్పిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. లేకుంటే ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా? అని బాపురావుకు సవాలు విసిరారు. ఎవరు అవినీతికి పాల్పడ్డారో బహిరంగ చర్చకు సిద్ధమా అని అన్నారు. నాగోబా, జంగుబాయి జాతరలకు, జోడెఘాట్‌ ఉత్సవాలకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. హైదరాబాద్, ఆదిలాబాద్‌లో ఆదివాసీ భవన్‌లు నిర్మించామన్నారు. తనను గెలిపిస్తే లంబాడీలను తొలగించే అంశం ఒక సంతకంతో అయిపోతుందన్న బాపురావు.. ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఎందుకు సంతకం పెట్టడం లేదని ఎద్దేవా చేశారు. అనంతరం సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్‌ మెట్లు ప్రహ్లాద్, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ మనిషా, నాయకులు  గోవర్ధన్‌రెడ్డి, రాజేశ్వర్, సాజిదొద్దీన్, ఆశమ్మ, సతీష్, ఖయ్యుం పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు