పతనావస్థలో టీడీపీ : మల్లాది విష్ణు

17 Nov, 2019 17:41 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: హైందవ సాంప్రదాయాన్ని కాపాడే విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. ఆదివారం చోడవరం మండలం వెంకన్న పాలెంలో జరిగిన బ్రాహ్మణ కార్తీక వన సమారాధనలో ఆయనతో పాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై కొన్ని దుష్టశక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అన్ని వర్గాలకు మేలు జరిగేవిధంగా సీఎం నిర్ణయాలు తీసుకుంటారన్నారు.

సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయన మాట వినడం లేదు..
టీడీపీ నేతలు, కొన్ని పత్రికలు దిగజారి వ్యవహరిస్తున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కుల,మతాలతో సంబంధం లేకుండా ప్రజలందరూ 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిపించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు పూర్తికాక ముందే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. రాజకీయంగా ఎదుర్కొలేక చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, మత పరమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ పెట్టి రూ.500 కోట్లు బడ్జెట్‌ కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని అన్నారు. టీడీపీలో సంక్షోభం ఏర్పడిందని.. చంద్రబాబుపై సొంత పార్టీ నాయకులే తిరగబడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ పతనావస్థకు చేరుకుందన్నారు. చంద్రబాబు దీక్ష చేస్తే 14 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారని, సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు మాట వినడం లేదని ఎద్దేవా చేశారు.

>
మరిన్ని వార్తలు