రాజకీయాలు సీఎం పదవి కోసం కాదు : రజనీ  

12 Mar, 2020 11:50 IST|Sakshi
రజనీకాంత్‌

చెన్నై : తాను ముఖ్యమంత్రి పదవి కోసం రాజకీయాల్లోకి రావటం లేదని, కేవలం మార్పుకోసం వస్తున్నానని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్పష్టం చేశారు. గురువారం రజనీ మక్కల్‌ మండ్రమ్‌ రాష్ట్రవ్యాప్త కార్యదర్శులతో హోటల్‌ లీలాప్యాలెస్‌లో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన రాజకీయ భవిష్యత్‌పై రజనీ క్లారిటీ ఇచ్చారు. 2021లో తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయనుందని చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ధన బలం, జన బలం, కుయుక్తులు.. ఎంతకైనా తెగించేవారొకవైపు.. ప్రభుత్వంతో పాటు ఆ కుబేరుడి ఖజానానే చేతుల్లో ఉంచుకున్న వారు మరో వైపు.. వీరి మధ్య నేను నా సినిమా ఇమేజ్‌తో.. కేవలం అభిమానుల బలంతో జయించటం సాధ్యమా. ప్రజల మనస్తత్వంలో మార్పు రావాలి. యువత రాజకీయాల్లోకి రావాలి. నా పార్టీలో 60శాతం సీట్లు 50ఏళ్ల లోపు వయసుగల వారికి కేటాయిస్తా. ఎన్నికలంటే మామూలు విషయం కాదు. ( నాకు రాజకీయాలొద్దు.. సినిమాలే చాలు )

రాష్ట్రంలోని  డీఎంకే, ఏఐడీఎంకేలకు 30శాతం ఓట్లు పార్టీలని చూసి వేస్తే మిగిలిన 70శాతం ఓట్లు కరుణానిధి, జయలలితలను చూసి వేశారు. ఇప్పుడు ఆ ఇద్దరూ లేరు. అదే మన విజయానికి మార్గం. ఇప్పుడు నేను రాజకీయాల్లోకి రావటానికి సిద్ధంగా ఉన్నా. తమిళనాడు రాజకీయాలకు పెట్టిందిపేరు. వివేకానంద, గాంధీల జీవితాలలో పెను మార్పులు ఇక్కడే చోటుచేసుకున్నాయి. 2021లో 1967నాటి చరిత్ర పునారావృతం కావాలి. ఓట్లు చీల్చడానికి నేను రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడు బాగుకోసం ప్రజలు ఆలోచించాలి. ‘ ఏం? పార్టీ ప్రారంభించిన తర్వాత ఇవన్నీ మాట్లాడొచ్చు కదా? ఇదేమన్నా స్ట్రాటజీనా..’ అని కొంతమంది అంటున్నారు. అవును.. ఇది నా మనసులోనుంచి పుట్టిన స్ట్రాటజీ, బుద్ధిలోంచి పుట్టినది కాదు. ఎన్నికల సమయానికి పార్టీని సంసిద్ధం చేస్తా’నని చెప్పారు. 

చదవండి : రజనీకాంత్‌ సూపర్‌ హీరో: బేర్‌ గ్రిల్స్‌

ఓ విషయంలో మోసపోయా: రజనీకాంత్‌

మరిన్ని వార్తలు