‘ఉపాధి’ సిబ్బందికి లోకేశ్‌ ఝలక్‌

14 Feb, 2019 11:03 IST|Sakshi

కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంచుతున్నట్టు ప్రకటన

వివరాలు తెలియనీయకుండా రహస్య జీవో జారీ 

ప్రభుత్వ నిధులతో ఉద్యోగులతో సన్మానం

సాక్షి, అమరావతి: రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేశ్‌ బుధవారం తన శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను నిలువునా మోసం చేశారు. కేంద్రం ఇస్తున్న ఉపాధి హామీ పథకం నిధుల్లోంచే దాదాపు రూ.రెండున్నర కోట్లు ఖర్చు పెట్టి ఆ విభాగంలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పిలిపించుకుని, వారిచే సన్మానం చేయించుకుని.. ఆ సన్మాన సభలో జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం జీవో నంబర్‌ 52ను జారీ చేసినట్టు తెలిపారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఆ జీవో గురించి చూస్తే.. దానిని కాన్ఫిడెన్షియల్‌గా పేర్కొంటూ వివరాలు కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డారు. 

ఐఏఎస్‌ల సమక్షంలోనే అధికారుల లోకేశ్‌ భజన 
ఉపాధి కూలీలకు గతేడాది డిసెంబర్‌ నుంచి దాదాపు రూ.360 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. అయినా ఆ శాఖ మంత్రి లోకేశ్‌.. ఆ పథకం నుంచే రూ.రెండున్నర కోట్లు ఖర్చుపెట్టి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో తన సన్మాన కార్యక్రమం నిర్వహించుకున్నారు. సిబ్బందికి జీతాలు పెంచుతున్నట్టు ఆశ పెట్టి, రాష్ట్రవ్యాప్తంగా ఆ పథకంలో పనిచేసే ఉద్యోగులను ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసిమరీ విజయవాడ రప్పించుకున్నారు. సభలో రాజకీయ నాయకులతో పాటు ఉద్యోగులు కూడా ఐఏఎస్‌ అధికారుల సమక్షంలోనే మంత్రి లోకేశ్‌ను పులిబిడ్డ.. అంటూ కీర్తించారు. లోకేశ్‌ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచుతున్నట్టు ప్రకటించారు.  

మరిన్ని వార్తలు