అవును..వాళ్లిద్దరూ ఒకటయ్యారు.!

21 Apr, 2018 08:09 IST|Sakshi
ముచ్చటించుకుంటున్న అనిల్‌లాడ్, నారా సూర్యనారాయణరెడ్డి

అనిల్‌లాడ్, నారా కలసి వచ్చి నామినేషన్‌ దాఖలు

కేసీ కొండయ్య, అల్లం, దివాకర్‌బాబు గైర్హాజర్‌

దేవుడు నిర్ణయించలేదు..టికెట్‌ దక్కలేదు : నారా  

సాక్షి, బళ్లారి: ,ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరుపున టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించిన అనిల్‌లాడ్, నారా సూర్యానారాయణరెడ్డిలు ఒక్కటయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు జాబితా ప్రకటించే వరకు బళ్లారి సిటీ నుంచి లాడ్, నారా ఇద్దరు టికెట్‌ కోసం తీవ్రంగా లాబీయింగ్‌ చేశారు. చివరకు అనిల్‌లాడ్‌కే టికెట్‌ దక్కింది. టికెట్‌ కోసం తీవ్రంగా పోటీ పడిన నారా, అనిల్‌లాడ్‌ ఒక్కటయ్యారు. శుక్రవారం నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి టికెట్‌ కోసం పోటీ పడిన నారా, లాడ్‌ ఒక్కటై రావడం చర్చనీయాంశంగా మారింది. అనిల్‌లాడ్‌ నామినేషన్‌ కార్యక్రమంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు, మాజీ మంత్రులు అల్లం వీరభద్రప్ప, దివాకర్‌బాబులతోపాటు విధాన పరిషత్‌ సభ్యుడు కే.సీ.కొండయ్యతో పాటు పలువురు కాంగ్రెస్‌ కార్పొరేటర్లు కూడా హాజరు కాలేదు. అనిల్‌లాడ్‌పై కార్పొరేటర్లులో తీవ్ర అసంతృప్తి ఉంది. టికెట్‌ కోసం పోటీ పడిన ఇద్దరు నేతలు చెట్టాపట్టాలు వేసుకుని నామినేషన్‌ దాఖలు చేయగా, మిగిలిన నేతలు గైర్హాజరు కావడంతో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు స్పష్టంగా కనిపించాయి. అంతర్గత విభేదాలను లాడ్‌ ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే.

దేవుడు నిర్ణయించలేదు..టికెట్‌ దక్కలేదు : బళ్లారి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరుపున పోటీ చేయాలని దేవుడు నిర్ణయించలేదు, అందుకే తనకు టికెట్‌ దక్కలేదని కురుగోడు మాజీ ఎమ్మెల్యే నారా సూర్య నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆయన నగరంలోని సిటీ కార్పొరేషన్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టికెట్‌ కోసం ప్రయత్నించానని, అయితే ఎవరికైనా ఒకరికే కదా టికెట్‌ వస్తుందన్నారు. టికెట్‌ రానంత మాత్రాన తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. పార్టీ టికెట్‌ అనిల్‌లాడ్‌కు కేటాయించిందని, ఆయన గెలుపునకు ప్రయత్నం చేస్తామన్నారు. భవిష్యత్తులో తనకు కేంద్ర మంత్రి అయ్యే యోగం ఆ దేవుడు కల్పించారేమోనని చమత్కరించారు.

మరిన్ని వార్తలు