బాల్‌ఠాక్రేను వేధించడం కళ్లారా చూశా

10 Dec, 2017 12:37 IST|Sakshi

మాజీ ముఖ్యమంత్రి నారాయణ్‌ రాణె

ఉద్ధవ్‌ ఠాక్రే బండారం బయటపెడతా

సాంగ్లి: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే నోరు మూసుకోపోతే ఆయన బండారం మొత్తం బయటపెడతానని మాజీ ముఖ్యమంత్రి నారాయణ్‌ రాణె హెచ్చరించారు. తాను బాల్‌ఠాక్రేను వేధించినట్టు ఉద్ధవ్‌ చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. మహారాష్ట్రలోని సాంగ్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బాల్‌ఠాక్రే బతికుండగా ఆయనకు తాను తాను ఎటువంటి సమస్యలు సృష్టించలేదన్నారు. ఉద్ధవ్‌, ఆయన కుటుంబమే ‘పెద్దాయన’పై వేధింపులకు పాల్పడిందని ఆరోపించారు.

‘బాబాసాహెబ్‌ను ఉద్ధవ్, ఆయన కుటుంబ సభ్యులు వేధించడం నా కళ్లారా చూశాను. ఉద్ధవ్‌ నోరుమూసుకుని, నాపై కుట్రలు కట్టిపెట్టకపోతే ఆయన బండారం బయటపెట్టేందుకు వెనుకాడను. బాబాసాహెబ్‌ బతికుండగా ఆయనకు నేను ఏవిధంగానూ కష్టం కలిగించలేదు. బాల్‌ఠాక్రే నివాసంలో మాతృశ్రీలో జరిగిన అన్నింటికీ నేను ప్రత్యక్షసాక్షిని. వీటన్నింటినీ కచ్చితంగా వెల్లడిస్తా. నాపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. గతంలోనూ ఇదే చెప్పాన’ని నారాయణ్‌ రాణె పేర్కొన్నారు.

మహారాష్ట్రలోని ఫడ్నవీస్‌ ప్రభుత్వం.. రాణెకు మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధమవుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో శివసేన నాయకులు ఆయనను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. బాల్‌ఠాక్రేకు అత్యంత సన్నిహితుడైన రాణె గత సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌ పార్టీని వీడి మహారాష్ట్ర స్వాభిమాన్‌ పేరుతో సొంత పార్టీ పెట్టారు. తర్వాత కేంద్రం, మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వంతో చేతులు కలిపారు.

మరిన్ని వార్తలు