‘ఓటమి భయంతోనే జీఎస్‌టీ సవరణలు’

13 Nov, 2017 16:35 IST|Sakshi

సాక్షి,ముంబయి: బీజేపీపై శివసేన విమర్శల దాడి కొనసాగుతోంది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే జీఎస్‌టీ పన్నురేట్లలో మార్పులు చేశారని బీజేపీ మిత్రపక్షం శివసేన ఆరోపించింది. దేశ ప్రజలంతా జీఎస్‌టీని సమర్ధిస్తున్నారని, పన్ను రేట్లలో మార్పులు ఉండవని ధీమాగా చెప్పిన బీజేపీ ప్రజాగ్రహం ముందు తలవంచక తప్పలేదని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో శివసేన వ్యాఖ్యానించింది.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో నే పన్నురేట్లను కేంద్రం సవరించిందని విమర్శించింది.గుజరాత్‌ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, మంత్రులను రోజుల తరబడి మోహరించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించింది.

దేశ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సహా ప్రముఖ ఆర్థిక వేత్తలంతా జీఎస్‌టీ, నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగించిన తీరును కళ్లకు కడుతుంటే వారిని ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని పేర్కొంది.జీఎస్‌టీ, నోట్ల రద్దుతో చిన్న వ్యాపారులు చితికిపోయారని, శివసేన వారికి మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు