మోదీ కాదు మొండి దేవుడు

14 Apr, 2018 10:45 IST|Sakshi
నీటికి పూజలుచేస్తున్న మంత్రి, ఎమ్మెల్యే, రమేష్‌

మంత్రి ఆదినారాయణరెడ్డి

జమ్మలమడుగు : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మోదీ కాదని మొండిదేవుడని మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శించారు. శుక్రవారం మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోకి ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు, పౌరసరఫరాల శాఖ చైర్మన్‌ మల్లేల లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిలతో కలసి నీటిని విడుదల చేశారు. అనంతరం మంత్రి ఆది విలేకరులతో మాట్లాడారు. టీడీపీ బీజేపీకి మిత్ర పక్షమైనా నాలుగు సంవత్సరాలపాటు కలిసి మెలసి ఉన్నా రాష్ట్రాభివృద్దికి ఏమాత్రం సహకరించలేదన్నారు. విభజన చట్టంలో ఉన్న 19 అంశాలను కేంద్రం అమలు పరచడంలో  ఘోరంగా విఫలమైందన్నారు. ప్రత్యేక హోదాను ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నారు.

పట్టిసీమ పూర్తికావడంతోనే కృష్ణనది నుంచి గండికోటకు, మైలవరం జలాశయాలకు నీటిని తెచ్చుకున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మైలవరం నాలుగు, గండికోటలో ఆరు టీఎంసీల నీరు వచ్చిందన్నారు.  పెన్నానది పరివాహక 100గ్రామాలకు మూడు మున్సిపాలిటీల ప్రజలకు  తాగునీరు అందించాలని ముఖ్యమంత్రిని కోరామని, ఆయన సూచిన మేరకు నీటిని విడుదల చేయించామన్నారు. రోజుకు 1000 క్యూసెక్కుల చొప్పున 11 రోజుల పాటు పెన్నానదికి విడుదల చేస్తామన్నారు. మైలవరం జలాశయానికి సంబంధించిన ఉత్తర,దక్షిణ కాలువలను త్వరగా పూర్తి చేసి చివరి ఆయకట్టు రైతులకు నీరు అందించేవిధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు