‘తమిళుల బలమైన గొంతు ఆయన’

7 Aug, 2018 20:36 IST|Sakshi
కరుణానిధితో ముచ్చటిస్తున్న మోదీ(ఫైల్‌ ఫోటో)

చెన్నై : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (94) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్‌ మీడియాలో సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కరుణానిధి తన జీవితాన్ని పేదలు, అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. తనకు చాలాసార్లు కరుణానిధితో మాట్లాడే అవకాశం దొరికిందన్నారు.

ఆయన ఎప్పుడు ప్రజల సంక్షేమం గురించి, పాలన గురించే చర్చించే వారని తెలిపారు. తమిళనాడు అభివృద్ధికి కృషి చేస్తూనే, దేశాభివృద్ధికి పాటుపడ్డారన్నారు. తమిళనాడు, తమిళుల తరపున కరుణానిధి తన గొంతును వినిపించే వారన్నారు. అంతేకాక ఎమర్జెన్సీ పరిస్థితులను ఆయన చాలా బలంగా వ్యతిరేకించారని గుర్తు చేసుకున్నారు.

మోదీ గత ఏడాది నవంబర్‌లో కరుణానిధిని కలిశారు. ఒక స్థానిక పత్రిక వజ్రోత్సవ వేడుకలకు హాజరయిన మోదీ, ఆఖరు నిమిషయంలో గోపాలపురంలో ఉన్న కరుణానిధిని కలిశారు. ఆ రోజు మోదీ దాదాపు 20 నిమిషాల పాటు కరుణానిధితో ముచ్చటించారు. ఆయన భార్య దయాళు అమ్మళ్‌, రజథి అమ్మల్లను కలిశారని కరుణానిధి కుమార్తె కనిమొళి తెలిపారు. మోదీ ఆయనను కలవడం అదే చివరిసారి. మోదీ రేపు ఉదయం చెన్నై రానున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు