ఔను: మోదీగారు చంద్రుడిని భూమిపైకి తేబోతున్నారు!

12 Oct, 2017 09:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యంగా రాహుల్‌గాంధీ తన విమర్శలకు పదును పెట్టారు. మోదీని విమర్శించేందుకు దొరికే ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. ఇటు గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో మోదీ సర్కారును ఏకీపారేస్తున్న రాహుల్‌.. అటు సోషల్ మీడియాలోనూ అధికారగణాన్ని, కాషాయ నాయకత్వాన్ని తూర్పారపడుతున్నారు.

గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్‌ బుధవారం ట్విట్టర్‌లో ప్రధాని మోదీ లక్ష్యంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసత్య హామీలు గుప్పించడంలో మోదీ దిట్ట అని, 2028నాటికి గుజరాత్‌లోని ప్రతి ఒక్కరికి చంద్రుడిపై ఇల్లు కట్టిస్తానని ఆయన హామీ ఇవ్వగలరని.. అంతేకాకుండా 2030నాటికి ఏకంగా చంద్రుడిని భూమికిపైకి తెస్తానని ఆయన చెప్పగలరని ఎద్దేవా చేశారు.

'మోదీగారు 2025నాటికి గుజరాత్‌లోని ప్రతి వ్యక్తి చంద్రుడిపైకి వెళ్లేందుకు రాకెట్‌ ఇవ్వబోతున్నారు. 2028 నాటికి గుజరాతీలకు చంద్రుడిపై ఇళ్లు కట్టించి ఇవ్వబోతున్నారు. ఇక, 2030 నాటికి మోదీజీ ఏకంగా చంద్రుడినే నేలపైకి తీసుకురాబోతున్నారు' అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

నల్లదొంగల కోసమే నోట్ల రద్దు!
లింఖేడ (గుజరాత్‌): నల్లధనం దాచుకున్న దొంగలకు సాయం చేసేందుకే ప్రధాని పెద్దనోట్లను రద్దుచేశారని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ ఆరోపించారు. అదొక ఏకపక్ష, వెర్రి చర్య అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో రాహుల్‌ బుధవారం దాహొద్‌ జిల్లాలోని లింఖేడలో సభలో మాట్లాడారు. ‘నోట్లరద్దుతో సామాన్యులు, చిన్న వ్యాపారులు పూర్తిగా ధ్వంసం కాలేదని మోదీ తెలుసుకున్నారు. వారి జీవితాలను మరింత నాశనం చేయడానికే జీఎస్టీ తెచ్చారు’ అని రాహుల్‌ దుయ్యబట్టారు. జీఎస్టీపై జాగ్రత్తగా వ్యవహరించాలనీ, ఎక్కువ సంఖ్యలో శ్లాబులు పెట్టి దానిని ప్రతిబంధకంగా మార్చవద్దని ప్రభుత్వానికి కాంగ్రెస్‌ సూచించిందని చెప్పారు. నోట్లరద్దుతో దేశమంతా ఇబ్బందులు పడ్డసమయంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కొడుకు జయ్‌  కంపెనీల ఆస్తులు 16 వేల రెట్లు పెరిగాయని ఆరోపించారు.  మోదీ గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇక్కడ విద్య, ఆరోగ్య రంగాలపై ఖర్చుచేయాల్సిన నిధులను పారిశ్రామిక వేత్తల కోసం వెచ్చించారన్నారు. ‘అచ్ఛేదిన్‌’ మోదీ, అమిత్‌ షాలకు మాత్రమేనన్నారు.

మరిన్ని వార్తలు