గొప్పలకు పోతే ‘పప్పు'లుడకవ్‌ 

29 Jun, 2018 04:03 IST|Sakshi

‘ఫ్లెక్స్‌’పై ఫేక్‌ ప్రచారం!

అది ఏర్పాటైంది శ్రీసిటీలో.. రాయితీలిచ్చేది కేంద్రమే

రూ.లక్షల కోట్లలో పెట్టుబడులు, జాబులంటూ అవాస్తవాలు ప్రచారం.. నాలుగేళ్లలో మీరు ఇచ్చిన ఉద్యోగాలెన్ని?

మీరు పర్యవేక్షించే ఐటీ గ్రోత్‌ రేట్‌ ఎంతో చెప్పగలరా?

సోషల్‌ మీడియాలో లోకేష్‌పై మండిపడుతున్న నెటిజన్లు

సాక్షి, అమరావతి: యాపిల్‌.. శ్యాంసంగ్‌.. టీసీఎస్‌.. మైక్రోసాఫ్ట్‌ కంపెనీల తరహాలో రాష్ట్రానికి నేను ‘ఫ్లెక్స్‌ ట్రానిక్స్‌’ను తెచ్చానంటూ ఐటీ, గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌ ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడంపై సోషల్‌ మీడియాలో నిరుద్యోగులు, నెటిజన్ల నుంచి తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లడం, పలు అగ్రశ్రేణి కంపెనీలు వస్తున్నట్లుగా నాలుగేళ్లుగా ఊదరగొట్టినా ఒక్కటీ రాకపోవడం, రూ. లక్షల కోట్ల పెట్టుబడులంటూ రూ.వందల కోట్లు కూడా తేలేకపోవడం ఇదంతా టీడీపీ సర్కారు ప్రచార ఆర్భాటం అని ఎవరికి తెలియదు? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘మీరు స్వయంగా పర్యవేక్షిస్తున్న ఐటీ శాఖ పురోగతి ఏమిటి? నాలుగేళ్లుగా ఐటీ గ్రోత్‌ రేట్‌ ఎంతో చెప్పగలరా?’ అని లోకేష్‌ను ప్రశ్నిస్తున్నారు.

కనీసం ఈ నాలుగేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలిగే ధైర్యముందా? అని సూటిగా అడుతున్నారు. కొన్ని అనామక కంపెనీలను తెచ్చి భారీ ఉపాధి అవకాశాలంటూ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందుతుంటే తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నవే మూతపడుతున్నాయని, ఈ పరిస్థితికి కారణం ఎవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి 80,000 మంది ఐటీలో ఉపాధి పొందుతుండగా ఆయన హయాంలో 1.50 లక్షల మందికి అదనంగా ఉపాధి కల్పించి ఐటీ ఉద్యోగాలను 2.30 లక్షలకు చేర్చారని గుర్తు చేస్తున్నారు. మరి అలా చెప్పుకోవడానికి మీ దగ్గర ఏముంది? అని లోకేష్‌ను ప్రశ్నిస్తున్నారు. ఒక్కటైనా ఇన్నోవేషన్‌ కేంద్రాలుగానీ, స్టార్టప్‌ కంపెనీలుగానీ ప్రారభించి ఫలితాలు రాబట్టగలిగారా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలను, వాస్తవ పరిస్థితులను తెలియచేస్తున్న ‘సాక్షి’పై నారా లోకేష్‌ అక్కసు వెలిబుచ్చుతుండటం గమనార్హం. తాను ‘ఫ్లెక్స్‌ట్రానిక్‌’ను రాష్ట్రానికి తెస్తే అన్ని పత్రికలు బాగా ప్రాధాన్యతనిస్తే ‘సాక్షి’ మాత్రం చిన్న వార్తను ఇచ్చి సరిపెట్టిందని, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ‘సాక్షి’కి కనిపించడం లేదా? అంటూ లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

మీ ప్రతిభ ఏముంది?
‘ఫ్లెక్స్‌ ట్రానిక్స్‌’ రాష్ట్రంలో ఏర్పాటు కావటంలో మీ ప్రతిభ ఏముందని లోకేష్‌ను నెటిజన్లు, పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. దివంగత రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన శ్రీసిటీ సెజ్‌లో ‘ఫ్లెక్స్‌’ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోందని, దీనికి అందించే రాయితీలన్నీ కేంద్రమే భరిస్తోందని పేర్కొంటున్నారు. మరి ఈ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావడంలో టీడీపీ సర్కారు పాత్ర ఏముందని ప్రశ్నిస్తున్నారు. అనంతపురంలో కియా మోటార్స్‌ ఏర్పాటు విషయంలో కూడా చంద్రబాబు ఇదేవిధంగా ప్రచారం చేసుకోవడాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రధాన మోదీ కొరియా పర్యటన సందర్భంగా కియా మోటార్స్‌ ప్రతినిధులతో సమావేశం సందర్భంగా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తే ఇప్పుడు ఇదంతా తన ఘనతగా చంద్రబాబు చెప్పుకుంటున్నారని విమర్శిస్తున్నారు.

నాలుగేళ్లలో పెద్ద కంపెనీ ఒక్కటీ రాలేదు..
2019 నాటికి రాష్ట్రంలో రెండు లక్షల ఐటీ ఉద్యోగాలంటూ మంత్రి లోకేష్‌ చేస్తున్న ప్రచారంలో డొల్లతనం ఇటీవల కలెక్టర్ల సదస్సులో బట్టబయలైంది. రాష్ట్ర ఐటీ రంగంలోకి రూ. వేల కోట్ల పెట్టుబడులు, లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తున్నాయన్న ప్రచారాన్ని అధికారిక గణాంకాలే ఖండిస్తున్నాయి. గత నాలుగేళ్లలో ఏపీకి ఐటీ రంగంలో కేవలం రూ.1,765 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని, ఒక్క పెద్ద కంపెనీని కూడా ఆకర్షించలేకపోయామని కలెక్టర్ల సదస్సులో ఐటీపై రివ్యూ సందర్భంగా అధికారులే స్పష్టం చేశారు. హెచ్‌సీఎల్‌ కూడా రాష్ట్రంలో ఐటీ సర్వీసులను కాకుండా కేవలం పరిశోధన, నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. మంగళగిరి, విజయవాడ ఐటీ పార్కుల్లో చిన్న స్థాయి డీటీపీ, పేటీఎం కాల్‌ సెంటర్‌ లాంటి వాటిని పట్టుకుని ఐటీ కంపెనీలంటూ లోకేష్‌ చెప్పుకోవడాన్ని చూస్తుంటే ప్రచారంలో తండ్రిని మించిపోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు