తీర్మానం పెడితే చర్చకు స్వీకరించకపోవడం దారుణం

5 Apr, 2018 18:44 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్నసీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ

విజయవాడ: ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెడితే చర్చకు స్వీకరించక పోవడం దారుణమని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తన నియంతృత్వ పోకడలతో చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారని  ఆరోపించారు.ప్రతిపక్షానికి ఉన్న ప్రజాస్వామిక హక్కులను కేంద్రం నీరుగార్చుతోందని ధ్వజమెత్తారు. ఈ నెల 11న విజయవాడలో అంతిమ పోరాటంకు అఖిలపక్షం సిద్దమవుతోందని తెలిపారు. బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ, ఎదురుదాడికి దిగుతోందన్నారు. పునర్విభజన చట్టంలోని అంశాలు అమలు చేయాల్సిందేనని, విభజన సందర్భంగా రాజ్యసభలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.రేపు జనసేన, వామపక్షాలు పెద్ద ఎత్తున పాదయాత్ర చేపడుతున్నాయని తెలిపారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఏపీ సర్వతోముఖాభివృద్దికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని చెప్పారు. ఇందుకోసం వెయ్యికి పైగా పోరాటాలు చేస్తామని, 16 రాజకీయ పక్షాలు, 42 ప్రజా సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని పిలిస్తే వెళ్లామని, వైఎస్ఆర్‌సీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఆప్ నేతలను కూడా కలిశామని వివరించారు.జనసేన అధినేతను కూడా కలిసేందుకు ప్రయత్నిస్తుమన్నారు. ఈ నెల 11న అఖిలపక్షం కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. వైఎస్ జగన్ కూడా ఉమ్మడి పోరాటానికి కలిసి వస్తామని చెప్పారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఢిల్లీలో చేపట్టే దీక్షలకు ప్రత్యేక హోదా సాధన సమితి పూర్తి మద్దతు ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ఒకమెట్టు దిగి వైఎస్ఆర్సీపీ కూడా టీడీపీ మంత్రులు కలిసి అఖిలపక్షానికి ఆహ్వానించాలని ఈ సందర్భంగా చలసాని కోరారు.

సీపీఎం రాష్ట్ర నేత వై వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. బీజేపీ అబద్దాల ఫ్యాక్టరీ సృష్టించిందని విమర్శించారు.అసత్యాలు ప్రచారం చేయడమే వారి లక్ష్యమని, బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏం చేసుకుంటారో.. చేసుకోండని బరితెగించి చెబుతోందని వ్యాఖ్యానించారు. ఏపీపై కోపంతో.. కుట్రతో వ్యవహరిస్తోందని అన్నారు.

మరిన్ని వార్తలు