టీడీపీలో అధిపత్య పోరు.. పదవి కొల్పోయిన ఎంపీపీ

31 Oct, 2018 14:50 IST|Sakshi

సాక్షి, కంచికచర్ల: కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య అధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. సొంత పార్టీకి చెందిన మండల పరిషత్‌ అధ్యక్షురాలు(ఎంపీపీ)ని ఆ పార్టీ ఎంపీటీసీ సభ్యులు గద్దె దించారు. వివరాల్లోకి వెళ్తే.. కంచికచర్ల ఎంపీపీ వేల్పుల ప్రశాంతిని ఆ పదవి నుంచి తప్పించటానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ప్రశాంతిపై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు సబ్‌ కలెక్టర్‌ను కలిశారు. దీనిపై  స్పందించిన సబ్‌ కలెక్టర్‌ అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహించడానికి సభ్యులకు నోటీసులు ఇచ్చారు. అయితే దీనిపై ప్రశాంతి కోర్టును ఆశ్రయించడంతో అవిశ్వాస సమావేశం వాయిదా పడింది. 

ఆ తర్వాత ఎంపీటీసీలు కూడా కోర్టును ఆశ్రయించడంతో.. న్యాయస్థానం ఎంపీపీ, ఎంపీటీసీల పిటిషన్‌లను తిరస్కరించింది. దీంతో బుధవారం అవిశ్వాస సమావేశం జరుపుతున్నట్టు ఆర్డీఓ సభ్యులకు నోటీసులు అందజేశారు. ఆ మేరకు ఈ రోజు ఉదయం జరిగిన అవిశ్వాస తీర్మానం సమావేశానికి 15 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. వారందరు కూడా ప్రశాంతికి వ్యతిరేకంగా ఉన్నట్టు తెలిపారు. దీంతో ఆమె ఆ పదవిని కొల్పోవాల్సి వచ్చింది. కాగా, నేడు అవిశ్వాసంపై జరిగిన సమావేశానికి ప్రశాంతి హాజరుకాలేదు.

మరిన్ని వార్తలు