సిగ్గుమాలిన రాజకీయాలకు కేరాఫ్‌ బాబే

9 Sep, 2018 04:25 IST|Sakshi

     రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో పొత్తుకు వెంపర్లాట 

     పొత్తు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు ఒక్కడే

     వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  

విజయవాడ సిటీ: ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిగ్గుమాలిన రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తుపెట్టుకోవడం చూస్తే వైఎస్సార్‌ మరణం తరువాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టిన కేసులన్నీ చంద్రబాబు కుట్రలో భాగమేనని స్పష్టమవుతోందన్నారు. చంద్రబాబుకు బీజేపీ, కాంగ్రెస్‌తో రెండింటితోనూ సంబంధం ఉందని ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని రంగులైనా మార్చగల సమర్ధుడని వ్యాఖ్యానించారు.

విజయవాడలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి, ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టకుండా మోసం చేసిన కాంగ్రెస్‌తో పొత్తుకు తెలుగుదేశం పార్టీ వెంపర్లాడడం సిగ్గుచేటన్నారు. నాలుగున్నరేళ్లు ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ప్రజల వద్దకు ఏమని చెప్పి వెళ్లాలో తెలియక సతమతమవుతూ  మానసిక జబ్బుతో బాధపడుతున్నారన్నారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మృతి చెందినప్పుడే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ చనిపోయిందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, పార్టీ సిద్ధాంతాలు, విలువలను మరిచి చంద్రబాబు కాంగ్రెస్‌తోనే పొత్తుకు సిద్ధమవుతున్నాడన్నారు.  

ప్రతిపక్షంలో ఉండి అధికారపార్టీకి మద్దతు ఇచ్చిన ఘనుడు
గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు మద్దతు ఇచ్చి మూడున్నర సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపి ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కాడని మండిపడ్డారు. అప్పటి నుంచే చంద్రబాబు కాంగ్రెస్‌తో సంబంధాలు పెట్టుకున్నాడన్నారు. 2014లో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్‌ను సోనియాగాంధీని బండబూతులు తిట్టాడని, గుంటూరుకు కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వస్తే కోడిగుడ్లతో కొట్టించాడని, కాంగ్రెస్‌ను అంతమొందించేందుకు కత్తులు, కొడవళ్లు పట్టుకొని రోడ్ల మీదకు రావాలని పిలుపునిచ్చిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ‘‘కాంగ్రెస్‌ దేశానికి పట్టిన శని, కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి, కాంగ్రెస్‌ విధానం దోచుకోవడమే, కాంగ్రెస్‌ను పాతరవేయాలి’’ అంటూ చంద్రబాబు చేసిన అనేక ఆరోపణల పత్రికా కథనాలను సైతం పెద్దిరెడ్డి మీడియాకు చూపించి వివరించారు.

ఇప్పుడు పథకం ప్రకారమే కిరణ్‌కుమార్‌రెడ్డిని చంద్రబాబు కాంగ్రెస్‌లో చేర్పించారని పెద్దిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఆనాడు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తమ్ముళ్లు వీరప్పను మించిన స్మగ్లర్లు అని ఆరోపణలు చేసిన చంద్రబాబు వారిని పిలిచి కార్పొరేషన్‌ చైర్మన్‌గా కేబినెట్‌ ర్యాంకు ఇచ్చాడని గుర్తు చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి దొంగల కంపెనీకి నాయకుడని మాట్లాడి ఇప్పుడు వారితోనే పొత్తుకు చంద్రబాబు సిద్ధపడడం సిగ్గుచేటన్నారు. చిత్తూరు జిల్లాలో 12 వందల అడుగుల మేర బోరు వేసినా నీళ్లు వస్తాయనే నమ్మకం లేదని, అలాంటి చోటు నుంచి వచ్చిన చంద్రబాబు అసెంబ్లీలో కరువును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం.. 196 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించామని చెప్పకోవడం హేయనీయమన్నారు. ఖరీఫ్‌లో ఒక్క ఎకరానైనా రెయిన్‌గన్స్‌తో ఒక్క ఎకరా పంట కాపాడి ఉన్నా.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు.  

మరిన్ని వార్తలు