విజయన్‌కు కోపం.. 'భగవత్‌ జెండా ఎలా ఎగురవేస్తారు?'

30 Dec, 2017 10:49 IST|Sakshi

సాక్షి, తిరువనంతపురం : ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ జాతీయ జెండాను ఎగురవేసినందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. గత ఆగస్టులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కేరళకు వచ్చిన మోహన్‌ భగవత్‌ కర్ణాకెయమెన్‌ అనే ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన విజయన్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఇన్‌స్ట్రక్షన్‌(డీపీఐ) అధికారులకు ఆదేశాలు పంపించారు. ఆ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు, ఈవెంట్‌ మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకునే అవకాశం ఉందేమో పరిశీలించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న పాఠశాలలు కచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన మార్గ దర్శకాలకనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుందని, అంతేకాకుండా ఆగస్టు 15 వేడుకల్లో రాజకీయ నాయకులకు భాగస్వామ్యం కల్పించవద్దని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్‌ కూడా స్కూల్‌ అధికారులుగానీ, లేదంటే ప్రజాప్రతినిధులు మాత్రమే జెండాను ఎగురవేయాల్సి ఉంటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు