అన్నొచ్చాడు.. సమస్యలు తీరుస్తాడు

14 May, 2018 18:12 IST|Sakshi
సభలో ప్రసంగిస్తున్న శ్రీధర్‌, ఆళ్ల నాని, ఈశ్వరి

సాక్షి, ఏలూరు: అప్రహితంగా సాగుతున్న వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా 2 వేల కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా ఏలూరు మండలం వెంకటాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ తర్వాత పాత బస్టాండ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. ఈ సభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఆళ్ల నాని, కోటగిరి శ్రీధర్‌, ఈశ్వరిలు ప్రసంగించారు. ‘అన్నొచ్చాడు.. మన సమస్యలు తీరుస్తాడు’ అంటూ అక్కడి ప్రజానీకానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. (చరిత్రాత్మక ఘట్టం)

పాలనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌ సీపీ నేత కోటగిరి శ్రీధర్‌ విమర్శించారు. త్వరలో ప్రజా ప్రభుత్వం వస్తుందని, జగనన్న ప్రజల సమస్యలన్నీ తీరుస్తాడని శ్రీధర్‌ చెప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టారని ఎమ్మెల్సీ ఆళ్ల నాని తెలిపారు. చంద్రబాబు పాలనలో అన్ని అబద్ధాలు, మోసాలేనని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రతో ప్రతి ఒక్కరికి భరోసా కల్పిస్తున్నారన్నారు. నాలుగేళ్లలో చంద్రబాబు ఈ ప్రాంతానికి ఏమీ చెయ్యలేదని,  ఏలూరులో తాగు నీటి, వరద ముంపు సమస్యలను పరిష్కరించిన ఘనత దివంగత నేత వైఎస్సార్‌దేనని ఆళ్ల నాని పేర్కొన్నారు. 

రాబోయేది రాజన్న రాజ్యం... 
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో రాబోయేది రాజన్న రాజ్యమని వైఎస్సార్‌ సీపీ నేత మధ్యాహ్నపు ఈశ్వరి పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాల్సిందేనని ఆమె అన్నారు. టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె చెప్పారు. లక్షల మందికి వైఎస్సార్‌ ఇళ్లు కట్టించారని, కానీ, చంద్రబాబు పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. తన పాదయాత్రతో వైఎస్‌ జగన్‌ ఐదు కోట్ల మందికి భరోసా కల్పించారని ఈశ్వరి అన్నారు.

మరిన్ని వార్తలు