ప్రియాంక వీడియోపై హల్‌చల్‌!

2 May, 2019 13:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రియాంక గాంధీకి సంబంధించిన ఓ వీడియో క్లిప్పింగ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ‘చూడండి! ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా చిన్న పిల్లలను ప్రియాంక గాంధీ ఎలా రెచ్చగుడుతున్నారో, ఇదండీ కాంగ్రెస్‌ సంస్కతి’ అంటూ 12 సెకండ్ల నిడివిగల వీడియో క్లిప్పింగ్‌తో బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తుండగా, ‘ఈ మాటల బాగా లేవు. ఆహా బాగుండవు. మంచి మాటలైతే ఓకే, కానీ ఇవి బాగో లేవు, వద్దు’ అంటూ ‘చౌకీదార్‌ చోర్‌హై’ అంటూ నినాదాలు ఇస్తున్న పిల్లలనుద్దేశించి ప్రియాంక గాంధీ వారించినట్లు 40 సెకండ్ల నిడివిగల పూర్తి వీడియోను కాంగ్రెస్‌ పార్టీ మహిళా సంఘం విడుదల చేసింది. 

తిమ్మిని బమ్మి చేయడంలో, నకిలీ వార్తలను సృష్టించడంలో, వీడియోలను మార్ఫింగ్‌ చేయడంలో, వార్తలను వక్రీకరించడంలో ఆరితేరిన బీజేపీ సోషల్‌ మీడియా విభాగం మాత్రం తనదైన శైలిలో ప్రియాంక గాంధీ హెచ్చరిక మాటల వీడియో కత్తిరించి, మిగతా వ్యాఖ్యలకు తన కామెంట్‌ను జోడించి గోబెల్స్‌కు మించిన స్థాయిలో ప్రచారం చేస్తోంది. ‘ఈ అమాయక పిల్లలకు కాంగ్రెస్‌ ఏం నేర్పుతుండో చూడండి!’ అంటూ చౌకీదార్‌ నరేంద్ర మోదీ ఫాలోవర్‌ చౌకీదార్‌ అంకూర్‌ సింగ్‌ ట్వీట్‌ చేయగా, దాన్ని బీజేపీ ప్రముఖులు షేర్‌ చేస్తున్నారు. అలా షేర్‌ చేస్తున్న ప్రముఖుల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఒకరు. కాంగ్రెస్‌ పార్టీది ఎంతటి నీచత్వమో చూడండంటూ ఆమె ప్రియాంక గాంధీ వీడియో క్లిప్పింగ్‌ను షేర్‌ చేశారు. ఆమె ట్వీట్‌ను ప్రముఖ బాలీవుడ్‌ నటుడు పరేష్‌ రావల్‌ రీ ట్వీట్‌ చేస్తూ, ‘నేను దీనికేమీ ఆశ్చర్యపడడం లేదు. కాంగ్రెస్‌ కాంగ్రెస్‌లానే ప్రవర్తిస్తోంది’ అంటూ వ్యాఖ్యానించారు. నిజానిజాలు తెలుసుకోకుండా ‘మై నేషన్‌’ మీడియా సంపాదకుడు అభిజిత్‌ మజుందార్‌ స్పందిస్తూ ‘70 ఏళ్లుగా దేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఇలాగే పాలించింది’ అంటూ వ్యాఖ్యానించారు. 

వాస్తవానికి ఆ వీడియోలో ఏముంది?
ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్న ప్రియాంక గాంధీకి మంగళవారం నాడు మార్గమధ్యలో ఓ పాఠశాల ముందు ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు. వారి వద్దకు వెళ్లగానే పిల్లలంతా ఒక్కసారిగా ‘ప్రియాంక గాంధీ జిందాబాద్, రాహుల్‌ గాంధీ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత చౌకీదార్‌ చోర్‌ హై అంటూ నినాదాలు చేయగా ప్రియాంక గాంధీ ఆనందించడం కనిపిస్తోంది. ఆ తర్వాత పిల్లలు మోదీజీ బ... అంటూ అసభ్యపదాన్ని అందుకున్నారు. దానికి హహ్వా....అంటూ ఆశ్చర్యపోయిన ప్రియాంక గాంధీ ‘యే వాలా అచ్చా నహీ, అచ్చా నహీ లగ్‌తా, అచ్చేవాలా బోలో, క్యా ఠీక్‌ హై’ అంటూ పిల్లలను హెచ్చరించడం, అందుకు స్పందించిన పిల్లలు ‘రాహుల్‌ గాంధీ జిందాబాద్‌’ అంటూ నినదించడం వినిపిస్తుందీ, కనిపిస్తుంది. బీజేపీ వీడియోలో ఆమె హెచ్చరించిన వాఖ్యలను కత్తిరించి వేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ పోస్ట్‌ చేసిన రెండు వీడియో క్లిప్పింగ్‌లను చూసి ఏది వాస్తవమో ఎవరైనా తెలుసుకోవచ్చు. అయితే ప్రచారం కోసమే కాంగ్రెస్‌ పార్టీ కూడా పిల్లలను ఆర్గనైజ్‌ చేసినట్లు తెలుస్తోంది. దాన్ని విమర్శించడంలో తప్పులేదు. కానీ వాస్తవాన్ని వక్రీకరించడమే తప్పు.

మరిన్ని వార్తలు