కన్నాలేసేవాడే సిగ్గుపడాలి: మంత్రి

11 Jan, 2018 18:45 IST|Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, బీజేపీ నాయకుల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజుకు మద్దతుగా తనపై విమర్శలు చేసిన మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్‌పై మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మండిపడ్డారు. తాను నిరంతర శ్రామికుడినని, అంచెలంచెలుగా కష్టపడి ఈ స్థాయికొచ్చానని చెప్పుకొచ్చారు.

‘నన్ను ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్ అని మున్సిపల్ చైర్మన్ కామెంట్ చేశాడు. అవును నేను ఆఫ్ట్రాల్‌ ఫొటోగ్రాఫర్‌నే. నేను ఈరోజుకీ ఫోటోగ్రాఫర్‌ననే అందరికీ చెప్తా. 24 గంటల్లో 18 గంటలు పనిచేసే నిరంతర శ్రామికుడిని. కష్టపడ్డావోడు సిగ్గుపడక్కర్లేదు, కన్నాలేసేవాడే సిగ్గుపడాలి. నాపై కామెంట్లు చేస్తున్న నీవు నీ చరిత్ర ఏంటో తెలిసుకో, నేను నీ చరిత్ర బయటకు తీయడానికి క్షణం పట్టదు.  నీకు దమ్ముంటే నా చరిత్ర గురించి తెలుసుకో. నువ్వెంత వెతికినా నా వెనుక నా కష్టమే కనపడుద్ది. నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఫోటోగ్రాఫర్‌గా పనిచేసి అంచెలంచెలుగా కష్టపడి ఈ స్థాయికొచ్చా. నేను ఫొటోగ్రాఫర్‌కు ఫొటోగ్రాఫర్‌ని, ఆటోడ్రైవర్‌కు ఆటో డ్రైవర్, కూలీకి కూలీని. నేనెప్పుడూ కష్టపడే జీవినే, నిరంతర శ్రామికుడినని గర్వంగా చెబుతాన’ని మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు