మోదీని కౌగిలించుకున్న రాహుల్‌ గాంధీ

20 Jul, 2018 14:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. లోక్‌సభలో శుక్రవారం ఊహించని దృశ్యం కంటపడింది. కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ఎవరూ ఊహించని విధంగా ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మోదీ సర్కారు తీరును తీవ్రంగా తూర్పాబట్టారు. తనపై రాహుల్‌ విమర్శలు చేస్తున్నా మోదీ మాత్రం నవ్వుతూ కనిపించారు.

తన ప్రసంగం ముగిసిన తర్వాత నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ స్థానం వద్దకు చేరుకున్నారు రాహుల్‌. ఆయనేం చేస్తారని సభలో ఉన్నవారితో పాటు లోక్‌సభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నవారంతా అనుకుంటుండగా.. ఊహించని ఘటన చోటుచేసుకుంది. రాహుల్‌తో మొదట కరచాలనం చేసేందుకు మోదీ సిద్దపడగా ఆయన నిరాకరించారు. తర్వాత రాహుల్‌ గాంధీ హఠాత్తుగా మోదీని అమాంతం వాటేసుకున్నారు. మోదీతో పాటు ఈ దృశ్యాన్ని చూసినవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అక్కడి నుంచి తన స్థానానికి తిరిగి వెళుతున్న రాహుల్‌ను మరోసారి పిలిచి మోదీ కరచాలనం చేశారు. బాగా మాట్లాడారంటూ మెచ్చుకున్నారు. దీంతో సభలో వాతావరణం తేలికపడింది.

రాహుల్‌ చిలిపి పని
తన స్థానంలోకి వెళ్లి కూర్చోగానే రాహుల్‌ గాంధీ మరో చిలిపి పని చేశారు. మోదీని కౌగిలించుకున్న తర్వాత తన సీటులో కూర్చొన్న ఆయన చిరునవ్వులు చిందిస్తూ తమ పార్టీ సభ్యులను చూసి సరదాగా కన్నుగీటారు. మోదీని వాటేసుకుని ఆయనకు షాక్‌ ఇచ్చానన్న భావం రాహుల్‌ ముఖంలో కనపడింది. రాహుల్‌కు ప్రధాని మోదీకి ఏవిధంగా కౌంటర్‌ ఇస్తారో చూడాలి.

మరిన్ని వార్తలు