కేరళ నుంచీ రాహుల్‌ ?

24 Mar, 2019 03:29 IST|Sakshi

బెంగళూరు సౌత్‌ నుంచి మోదీ?

కాంగ్రెస్, బీజేపీల కొత్త వ్యూహం

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాహుల్‌ గాంధీ సొంత నియోజకవర్గం యూపీలోని అమేథీతోపాటు కేరళలోని వయనాడ్‌ స్థానం నుంచి, ప్రధాని మోదీ వారణాసితోపాటు కర్ణాటకలోని బెంగళూరు(దక్షిణ) నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు మూడు పర్యాయాలు అమేథీ నుంచి గెలిచినందున ఇకపై ఆ సీటుపై ఆధారపడటం అంత సురక్షితం కాదని భావిస్తున్న రాహుల్‌.. ఈ దఫా మరో స్థానం నుంచీ పోటీ చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘జాతీయ స్థాయి నేతగా రాహుల్‌ గుర్తింపు పొందాలంటే దక్షిణాది నుంచీ పోటీ చేయడం అవసరం.

గెలిచిన ప్రతీ సీటు పార్టీకి చాలా కీలకం’ అని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు వయనాడ్‌ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోట. ఇక్కడ కాంగ్రెస్‌కు ఓటమి అన్నదే లేదు. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్‌ ఎంపీ షానవాజ్‌ ఇటీవలే మృతి చెందారు. దీంతో సిద్ధిఖి అనే నేతకు టికెట్‌ ఇచ్చినా పోటీకి ఆయన నిరాకరించారు. వయనాడ్‌ నుంచి రాహుల్‌ పోటీ చేయాలంటూ కేరళ పీసీసీ గట్టిగా కోరుతోందని పార్టీ ప్రతినిధి సూర్జేవాలా చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఊమెన్‌ చాందీ తిరునవంతపురంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ను వాయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలని కేరళ పీసీసీ కోరింది. కర్ణాటక, తమిళనాడు పార్టీ విభాగాలు కూడా తమ రాష్ట్రాల నుంచి పోటీ చేయాలంటూ ఇప్పటికే ఆయన్ను ఆహ్వానించాయి’ అని చెప్పారు.

కర్ణాటక నుంచి మోదీ
ప్రధాని మోదీని కర్ణాటక దక్షిణ నియోజకవర్గం నుంచి బరిలో ఉంచాలని కమలనాథులు యోచిస్తున్నట్లు సమాచారం. దక్షిణాదితోపాటు ఆ రాష్ట్రంలో పార్టీ విజయావకాశాలను మరింత మెరుగు పర్చేందుకు ఈ వ్యూహం పని చేస్తుందని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటక బీజేపీ విభాగం పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షాకు పలుమార్లు ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ రాష్ట్రంలోని 28 సీట్లకు గాను 21 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. ప్రకటించాల్సిన స్థానాల్లో బెంగళూరు(దక్షిణ) కూడా ఉంది. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి అనంత్‌కుమార్‌ భార్య తేజస్వినికి టికెట్‌ ఇచ్చేందుకు మార్గం సుగమం అయింది.

అనంత్‌కుమార్‌ ఇక్కడి నుంచి వరుసగా ఆరు పర్యాయాలు గెలుపొందారు. అయితే, ప్రధాని మోదీ ఇక్కడి నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నందునే తేజస్వినికి ఆఖరి నిమిషంలో టికెట్‌ ప్రకటించకుండా నిలిపివేసినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.  మోదీ 2014 ఎన్నికల్లో వారణాసితోపాటు వడోదర నుంచి పోటీ చేశారు. యూపీలోని అమేథీ నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌కు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ, సీపీఎం ఎద్దేవా చేశాయి. అమేథీలో ఓటమి భయం ఉన్నందునే రాహుల్‌ను వాయనాడ్‌ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్‌ భావిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌ విమర్శించారు. కాగా, కేరళలోని 20 ఎంపీ స్థానాలకు గాను 16 చోట్ల కాంగ్రెస్‌ పోటీచేస్తోంది.

భాగ్‌ రాహుల్‌ భాగ్‌
కేరళ నుంచి రాహుల్‌ పోటీ వార్తలపై అమేధీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ట్విట్టర్‌లో ‘భాగ్‌ రాహుల్‌ భాగ్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో స్పందించారు. ‘రాహుల్‌ను అమేథీ ప్రజలు తిరస్కరించారు. ఇతర రాష్ట్రాల ప్రజలు తమ వద్ద పోటీ చేయాలని కోరుకుంటున్నారంటూ అక్కడి నుంచి రాహుల్‌తో పోటీ చేయించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోంది’ అని ఆమె అన్నారు. ‘చాంద్‌నీచౌక్, అమేథీల్లో ఓడిపోయారు. మళ్లీ మళ్లీ ప్రజల తిరస్కరణకు గురైన ఆమె దొడ్డిదారిన రాజ్యసభ ద్వారా పార్లమెంట్‌లో అడుగుపెడుతున్నారు. మరోసారి అమేథీలో ఆమె ఓటమికి రంగం సిద్ధమైంది’ అంటూ స్మృతికి స్పందనగా కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా ట్విట్టర్‌లో పోస్ట్‌పెట్టారు.

మరిన్ని వార్తలు