రోడుపక్కన ప్రజలు.. సడెన్‌గా కారు ఆపిన రాహుల్‌

10 Jun, 2019 19:08 IST|Sakshi

వయనాడ్‌ (కేరళ):  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రోడ్డుమధ్యలో అకస్మాత్తుగా తన కాన్వాయ్‌ ఆపి.. తన కోసం ఎదురుచూస్తున్న అభిమానులను ఆశ్చర్యపరిచారు. తనను ఎంపీగా గెలిపించినందుకు కృతజ్ఞతగా వయనాడ్‌లో రాహుల్‌గాంధీ ఇటీవల పర్యటించిన సంగతి తెలిసిందే. ‘థాంక్స్‌ గివింగ్‌ టూర్‌’ పేరిట ఈ సందర్భంగా చేపట్టిన రోడ్‌షోలో ఆయన వయనాడ్‌ ప్రజలను కలిసి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో ఓ చోట రోడ్డుపక్కన గుమిగూడి.. తన కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ప్రజలను గుర్తించిన రాహుల్‌.. తన వాహనాన్ని మధ్యలోనే  ఆపి.. నేరుగా వారి వద్దకు వెళ్లారు. 

సిల్వర్‌ కలర్‌ కారు నుంచి రాహుల్‌ అకస్మాత్తుగా దిగి తమను పలుకరించడంతో అక్కడ ఉన్న వారు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆయనను చుట్టుముట్టి ఆయనతో కరచాలనం చేసేందుకు ఉత్సాహం చూపించారు. మరికొంతమంది ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు. ఇంతలోనే కాన్వాయ్‌ను ఆపి.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకొని రాహుల్‌ను చుట్టుముట్టిన ప్రజలను నియంత్రించారు. తనను ప్రజలు ఉత్సాహంగా చుట్టుముట్టి పలుకరించడంతో రాహుల్‌ నవ్వులు చిందిస్తూ..వారితో కరచాలనాలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు