రేవంత్‌రెడ్డి గుండెకోత..

28 Oct, 2017 19:06 IST|Sakshi

చంద్రబాబు ఎంట్రీతో పూర్తిగా మారిన సీన్‌

కేసీఆర్‌ది అరాచక పాలనంటూ తీవ్ర విమర్శలు

రాజీనామా ఎందుకు చేశారో స్పష్టత ఇవ్వకుండా భారీ లేఖ

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీ సాధారణ సభ్యత్వంతోపాటు కొడంగల్‌ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన రేవంత్‌ రెడ్డి.. ఈ సందర్భంగా రాసిన సుదీర్ఘలేఖ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చంద్రబాబును ఉద్దేశిస్తూ రేవంత్‌ రాసిన భారీ లేఖలో.. అసలు రాజీనామా చేయడానికిగల కారణాలు ఏ ఒక్కటీ స్పష్టంగా పేర్కొనలేదు. నేటి సందర్భానికి మూల కారణమైన ‘టీఆర్‌ఎస్‌- టీడీపీ మైత్రి’పై మాటమాత్రంగానైనా స్పందిచకపోవడం గమనార్హం. అదేసమయంలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీపీ ఏం చెయ్యలేక పోతున్నదో, తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులు ఏమిటో వివరించకుండానే లేఖను ముగించడం, అసలీ పరిస్థితులకు కారకుడైన పార్టీ అధ్యక్షుడిని పల్లెత్తుమాట అనకపోగా, ఆకాశానికి ఎత్తడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఎవరి గుట్టూ బయటపడదా? : ఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కలిశారన్న వార్తలు మొదలు, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీకి హాజరుకావడం, కొడంగల్‌లో కార్యకర్తల మధ్య ‘ఒక్కొక్కరి గుట్టు బయటపెడతా’నంటూ బెదిరింపుల ప్రసంగం.. తదితర అన్ని సందర్భాల్లోనూ రేవంత్‌ తనదైన శైలిలోనే దూకుడును ప్రదర్శించారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి నేరుగా హైదరాబాద్‌కు వచ్చారో.. పరిస్థితి కాస్త మారి, నేటి(శనివారం) విజయవాడలో జరిగిన భేటీతో పూర్తిగా చల్లబడంది. ఇక లేఖలో రేవంత్‌ చంద్రబాబును పొగిడిన తీరుపై ఆయన చేరబోయే(!) కాంగ్రెస్‌ పార్టీనే స్పందించాల్సిఉంది. మొత్తంగా బాబు రాకతో మెత్తబడ్డ రేవంత్‌.. ఓటుకు కోట్లు కేసుగానీ, సీఎం కేసీఆర్‌- ఏపీ మంత్రుల మధ్య ఆర్థిక వ్యవహారాలుగానీ, మరే ఇతర టీడీపీ సంబంధిత కుంభకోణాల్లోగానీ ఏఒక్కరి గుట్టూ బయటపెట్టబోనని రేవంత్‌ తన ‘వినయపూర్వక’ లేఖ ద్వారా చెప్పకనే చెప్పారు.

తెలంగాణ నరకం.. ఏపీ స్వర్గమా..! : చంద్రబాబుకు రాసిన లేఖలో రేవంత్‌.. కేసీఆర్‌పై తీవ్రస్థాయి విమర్శలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ సమాజం అత్యంత ప్రమాదపుటంచుల్లో ఉందని, ఒక కుటుంబం చేతిలో బందీ అయిందని, బంగారు తెలంగాణ ముసుగులో ప్రజాసంపద అడ్డగోలుగా దోపిడీ అవుతోందని ఆరోపించారు. అదేసమయంలో రైతుల దుస్థితి, పోలీసులు, టీఆర్‌ఎస్‌ నేతల దమనకాండ, ప్రజాస్వామిక హక్కుల హననం, ప్రశ్నించే గొంతుకలపై దాడులు తదితర అంశాలను పేర్కొంటూ, అన్నింటికీ కేసీఆరే దోషి అని, ఆయనతోనే పోరాటమని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను అధికారపక్షం పెద్ద ఎత్తున నిర్వహిస్తోందని వాపోయారు. కాగా, రేవంత్‌ లేఖలో పేర్కొన్న ‘ప్రజావ్యతిరేక’ అంశాలు.. ఆంధ్రప్రదేశ్‌కు కూడా పొల్లుపోకుండా వర్తిస్తాయనడంలో సందేహంలేదు.

టీటీడీపీ నేతలు గప్‌చుప్‌..: చంద్రబాబుతో భేటీ అనంతరం టీటీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌.. తన భవిష్యత్తు కోసమే నిర్ణయం తీసుకున్నారని, దానివల్ల పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు రంగప్రవేశానికి ముందు ఇదే నేతలు.. ‘ఓటుకు కోట్లు కేసు బాధ్యుడు రేవంతే’, ‘రేవంత్‌ గుట్టు మొత్తం రట్టుచేస్తాం’ అని వ్యాఖ్యానించడం తెలిసిందే. అయితే అసలు చంద్రబాబు-రేవంత్‌ రెడ్డిలు ఏం మాట్లాడుకున్నారు? మొన్నటిదాకా అగ్గిమీద గుగ్గిలంలా మండిన టీటీడీపీ నేతలకు రేవంత్‌ పట్ల ఒక్కసారే ప్రశాంత వైఖరిని ప్రదర్శించడం వెనుక మర్మమేమిటి? అనే విషయాలు ఇంకా వెల్లడికాలేదు.

ఇదీ.. బాబును నొప్పించకుండా రేవంత్‌ అనుభవించిన గుండెకోత..(పూర్తి లేఖ)


రేవంత్‌ రాజీనామా లేఖ..

మరిన్ని వార్తలు