ప్రజలకు రుణపడి ఉంటాను

24 May, 2019 06:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజల అవసరాలు, రాష్ట్ర విభజన హక్కులపై పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతుకను అవుతానని మల్కాజిగిరి ఎంపీగా గెలుపొందిన ఎనుగుల రేవంత్‌రెడ్డి అన్నారు. తనను ఆశీర్వదించిన మల్కాజిగిరి ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. తెలంగాణ కేసీఆర్‌ రాజ్యం అనుకుంటున్నారని, తండ్రీ కొడుకుల అహంకారం అణచేందుకే ప్రజలు ఈ ఫలితాలు ఇచ్చారన్నారు.

కేసీఆర్‌ అధికారాన్ని ఆస్తులు పెంచుకునేందుకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ గెలుపులో తన ప్రమేయం కంటే తెలంగాణ సాధించుకున్న విద్యార్థుల పాత్ర ఎక్కువగా ఉందని తెలిపారు. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం, ట్రైబల్‌ వర్సిటీలను సాధించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆంగ్లో ఇండియన్‌లకు అసెంబ్లీ, పార్లమెంట్‌లో ఉన్న రిజర్వేషన్లు రద్దు చేసే వరకు పోరాడతానని చెప్పారు. మల్కాజిగిరిని మరో నోయిడాగా అభివృద్ధి చేస్తానని అన్నారు. కంటోన్మెంట్‌ బోర్డు ఎత్తేసి, గ్రేటర్‌ పరిధిలోకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. మిలటరీ అధీనంలోని రోడ్లపై ప్రజలకు స్వేచ్ఛ ఉండేలా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పారు.  
 

మరిన్ని వార్తలు