సీట్ల సర్దుబాటుపై ఫిబ్రవరిలో నిర్ణయం

26 Jan, 2019 05:51 IST|Sakshi
సమావేశమైన పవన్‌కల్యాణ్, సురవరం, రాఘవులు తదితరులు

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వెల్లడి

విశాఖలో జనసేన, వామపక్షాల రౌండ్‌టేబుల్‌ సమావేశం

సాక్షి, విశాఖపట్నం/నగరంపాలెం (గుంటూరు): జనసేన, వామపక్షాల పొత్తు నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకుంటామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తెలిపారు. వచ్చే నెలలో మరోసారి సమావేశమవుతామన్నారు. విశాఖ రుషికొండలోని ఓ రిసార్ట్స్‌లో జనసేన, సీపీఐ, సీపీఎం ముఖ్య నాయకులు రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులుతో పవన్‌కల్యాణ్‌ మూడు గంటలపాటు చర్చించారు. అనంతరం వారితో కలిసి పవన్‌ విలేకరులతో మాట్లాడారు. వామపక్షాలు, జనసేన పార్టీల భావజాలం ఒకేలా ఉండడంతో వాటితో కలిసి పనిచేయాలన్న నిర్ణయానికొచ్చామని పవన్‌ చెప్పారు. పర్యావరణ కాలుష్యం, మైనింగ్‌ పాలసీ, 2013 భూసేకరణ చట్టం అమలు, జాయింట్‌ ఫ్యాక్టస్‌ ఫైండింగ్‌ కమిటీ నివేదికను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై చర్చించామని తెలిపారు. 2019 ఎన్నికల్లో ఎలా కలిసి వెళ్లాలన్న దానిపై చర్చించామన్నారు. ఈవీఎంలలో లోపాలపై తమకు అభ్యంతరాలున్నాయని, త్వరలో వాటిపై సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు. 

నిపుణుల కమిటీ వేయాలి
ఈవీఎంలపై తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్‌పై ఉందని సురవరం సుధాకరరెడ్డి చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు వ్యత్యాసం ఉండడం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారయ్యాయన్నారు. ఇలాంటి అనుమానాల నివృత్తికి నిపుణుల కమిటీ వేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. బీవీ రాఘవులు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు, ఆ ప్రక్రియలో మూడు పార్టీల పాత్ర గురించి చర్చించామని తెలిపారు. ప్రత్యేక హోదా, వాగ్దానాల అమలులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. సమావేశంలో జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, మాదాసు గంగాధరం, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు పాల్గొన్నారు. 

27న జనసేన శంఖారావం సభ
27న గుంటూరు లాడ్జి సెంటరులోని ఎల్‌ఈఎం స్కూల్‌ గ్రౌండ్‌లో జనసేన శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకుడు, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. శుక్రవారం ఆయన సభ ఏర్పాట్లను పరిశీలించారు. పవన్‌కల్యాణ్‌ ఈ సభలో పాల్గొంటారన్నారు.

మరిన్ని వార్తలు