‘పేదలు అమరావతిలో ఒక్క గజం కొనగలరా?!’

25 Feb, 2020 17:28 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి:  ప్రజలు నాయకులు మీద ఆధార పడకూడదనే గ్రామ సచివాలయం వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. పేదలు అమరావతిలో ఒక గజం స్థలం కొనగలిగే అవకాశం ఉందా అని, రాజధానిలో ఉద్యోగులు కూడా ఇల్లు కట్టుకొనేందుకు ఇష్టపడలేదన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారుని, రాజధాని నూజివీడులో పెడుతున్నామని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. రాజధానికి ప్రభుత్వ స్థలం ఉండాలని సీఎం జగన్‌ అసెంబ్లీలో చెప్పారన్నారు. అమరావతిలో ప్రభుత్వ స్థలం అయితే ఉద్యోగులు, పేదలకు ఇళ్ల స్థలాలు నామమాత్రపు ధరకు ఇవ్వొచ్చున్న ఉద్దేశంతో ఆయన అసెంబ్లీలో చెప్పారని ఆయన వెల్లడించారు. 

'అందుకే వికేంద్రీకరణ దిశగా అడుగులు'

ఇక చంద్రబాబు చేబుతున్నట్లు పూర్తిగా రాజదానిని తరలించడం లేదని, ఒక భాగాన్ని మాత్రమే వైజాగ్ తీసుకెళ్తున్నామని సజ్జల వివరించారు. రాజధాని ప్రజలే చంద్రబాబును నమ్మలేదని, అందుకే లోకేష్‌ను చిత్తుగా ఓడించారని విమర్శించారు. హైదరాబాద్‌తో పోటీ పడగలిగే రాజధానిని ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ చూస్తున్నట్లు తెలిపారు. కాగా అమరావతిలో జరిగిన కుంభకోణంలో విచారణ జరుగుతుందని, రాజధాని ప్రాంత రైతులను సీఎం జగన్ ఆదుకుంటారన్నారన్నారు. అభివృద్ధి అంత హైదరాబాద్‌లో కేంద్రీకృతం కావడం వలనే రాష్ట్రం విడిపోయిందని, మళ్ళీ ఏర్పాటు వాద ఉద్యమాలు రాకూడదనే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు రాజధానిలో కృత్రిమ ఉద్యమం చేయిస్తున్నారని, ఆయన మోసాన్ని ప్రజలకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వివరించాలన్నారు. 

కాగా అమరావతి నిర్మించాలంటే లక్షల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని, అప్పుల్లో ఉన్న మనం ఇప్పుడు లక్షల కోట్లు అప్పు తెచ్చి నిర్మించగలమా అని పేర్కొన్నారు. శివరామకృష్ణన్, శ్రీ కృష్ణ, జీఎన్ రావు, బోస్టన్ కమిటీలు కూడా అభివృద్ధి వికేంద్రికరణ చేయాలని సూచించాయని తెలిపారు. అమరావతిలో దళిత ఎంపీ కళ్ళలో కారం కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. దళిత ఎంపీపై దాడి చేయడం ఇది రెండవసారని ఆయన పేర్కొన్నారు. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నరకాసురుడు పాలన చేసాడు కాబట్టి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఏద్దేవా చేశారు. ప్రజలు బుద్ది చెప్పినా ఇంకా చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదు రామకృష్ణ విమర్శించారు. 

మరిన్ని వార్తలు