‘ప్రజలు ప్రశాంతంగా ఉంటే బాబుకు పబ్బం గడవదు’

12 Mar, 2020 19:56 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్‌ ఉత్సాహంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తమది అతి విశ్వాసం కాదని.. గెలుపు దిశగా కష్టపడి ముందుకు వెళ్తున్నామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేశారని గుర్తుచేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డబ్బు, మద్యం లేని ఎన్నికలు జరగాలని సీఎం వైఎస్‌ జగన్‌ కొత్త విధానం తీసుకొచ్చారని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతిపక్షం వినియోగించుకోలేపోతున్నాయని ఎద్దేవా చేశారు. 

ప్రజలు ప్రశాంతంగా ఉంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పబ్బం గడవదని విమర్శించారు. అందుకే మాచర్ల లాంటి ప్రాంతాల్లో గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేసి.. వాటిని వైఎస్సార్‌సీపీపై వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత నేత వర్ల రామయ్య విషయంలో చంద్రబాబు దారుణంగా వ్యవహరించాడని తెలిపారు. గత రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబుకు వర్ల రామయ్య గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు డబ్బుల కోసం సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌ వంటివారికి రాజ్యసభ టికెట్లు ఇచ్చారని అన్నారు. కానీ తమ నాయకుడు వైఎస్‌ జగన్‌.. రాష్ట్రానికి మేలు చేస్తానని చెప్పడంతో పారిశ్రామికవేత్త పరిమల్‌ నత్వానీకి కేటాయించారని స్పష్టం చేశారు. రాష్ట్రానికి మేలు జరిగే విషయంలో స్వాగతించాల్సిందిపోయి విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు